ఎవర్టన్తో మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకమే
రాబర్టో ఫిర్మినో ఇంటర్వూ్య
లివర్‌పూల్ విజయాల్లో ఫార్వర్డ్ ఆటగాడు రాబర్టో ఫిర్మినోది కీలక పాత్ర. అతడి ఆటతీరుతో జట్టు ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) టైటిల్ రేస్‌లో టాప్–3లో ఉందని చెప్పుకోవచ్చు. సోమవారం తమ చిరకాల ప్రత్యర్థి ఎవర్టన్తో జరిగే మ్యాచ్‌పై తామంతా ఆత్మవిశ్వాసంతో ఉన్నామని ఫిర్మినో చెబుతున్నాడు.
ఎవర్టన్తో జరగనున్న కీలక మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నారా?
అవును. ఇది చాలా పెద్ద మ్యాచ్. ఎవర్టన్తో ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఆటగాళ్లకే కాకుండా మా మద్దతుదారులకు కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. మ్యాచ్ గెలిచేందుకు తమ శక్తియుక్తులన్నీ ధారపోసేందుకు ప్రతీ ఆటగాడు ఎదురుచూస్తుంటాడు.
లివర్‌పూల్ టైటిల్ రేసులో ఉంది. ఇది మీపై ఒత్తిడి పెంచుతోందా?
ఈ సీజన్లో మా జట్టు చాలా బాగా ఆడుతోంది. అయితే ఇక్కడితోనే ఆగిపోం. ప్రీమియర్ లీగ్ టైటిల్ రేసులో మేమూ ఉన్నామనే విషయం వాస్తవం. అయితే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇప్పటిదాకా మా ఆటతీరుకు మార్కులు వేసుకోవాలంటే పదికి ఎనిమిది సాధించాం. ఇంతకన్నా మెరుగ్గా ఆడగలమన్న విశ్వాసం మాకుంది.
లివర్‌పూల్ టైటిల్ గెలుస్తుందని భావిస్తున్నారా? అదే జరిగితే మీ సంబరాలు ఎలా ఉంటాయి?
మాకు ఈ టైటిల్ ఎంత ముఖ్యమో తెలుసు. 1990 అనంతరం మేం చాంపియన్‌గా నిలవలేదు. ఇక మేమే గెలిస్తే మా సుదీర్ఘ ఎదురుచూపులు ఫలించినట్టు అవుతుంది. ఆ సంబరాలు కూడా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటాను.