రిపబ్లిక్ ఆఫ్ జకిస్థాన్..!
రిపబ్లిక్ ఆఫ్ జకిస్థాన్. ఎక్కడుంది అంటే... అమెరికాలో. జనాభా... ఒక్కరే. ఏమిటిది అమెరికాలో మరో స్వతంత్ర దేశం ఉండటమేమిటనే సందేహం వస్తోంది కదూ. న్యూయార్క్‌కు చెందిన జాక్ లాండ్స్‌బెర్గ్ అనే వ్యక్తికి పదేళ్ల కిందట వచ్చిన ఆలోచన ఫలితమే ఇది. బాక్స్ ఎల్డర్ కౌంటీలో ఓ నాలుగెకరాలు కొన్నాడు లాండ్స్‌బెర్గ్. దానికి రిపబ్లిక్ ఆఫ్ జకిస్థాన్ అని పేరుపెట్టేశాడు. దేశం కాని దేశానికి ఈయనే అధ్యక్షుడు. ఓ జెండాను కూడా రూపొందించాడు. పాస్‌పోర్ట్‌ను కూడా తయారుచేశాడు.
నాలుగెకరాల చుట్టూ కంచె వేసి ఓ బోర్డర్ పెట్రోల్ గేట్‌ను కూడా అమర్చాడు. ఇక్కడో రోబో పహారా కాస్తుంది. మనకంటూ కొంత ప్రదేశం ఉండాలి, అక్కడే మనం స్వేచ్ఛగా ఉండగలగాలి... అనే ఉద్దేశంతోనే ఇదంతా చేశానని చెప్పుకుంటాడీ లాండ్స్‌బెర్గ్. ఈ దేశంకాని దేశానికి దగ్గరగా... 60 మైళ్ల దూరంలో ఓ పట్టణం ఉందట. అలాగే 15 కిలోమీటర్లు కచ్చా రోడ్లపై వెళితేగాని అక్కడికి చేరుకోలేం. ఇదంతా చూస్తుంటే ఎవరి పిచ్చి వారికి ఆనందం అనుకోకుండా ఉండలేం కదా!