అజ్ఞాతంలోకి మనోరమా
పాట్నా: బీహార్‌లో అమలులో ఉన్న మద్యపాన నిషేధాన్ని జేడీయూ మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవి అతిక్రమించారు. ఈ నేపథ్యంలో ఆమె అరెస్ట్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమె మంగళవారం సాయంత్రం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మనోరమా దేవి యాదవ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఎమ్మెల్సీ కుమారుడు రాకీ యాదవ్ ... తన కారును ఓవర్ టేక్ చేశాడన్న కారణంతో 20 ఏళ్ల యువకుడిని శనివారం తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు మనోరమా దేవి నివాసంలో గాలింపు చర్యలు చేపట్టారు.
అందులోభాగంగా ఆమె నివాసంలో మందు బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యపాన నిషేధం అమలవుతున్న బిహార్‌లో అదీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మనోరమా నివాసంలో మద్యం దొరకడంతో... ఆమెను అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఆమె అరెస్ట్‌కు ఆదేశాలు జారీ చేసింది. కాగా మనోరమా దేవిపై ఆరేళ్ల పాటు పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.