పిల్లీ వచ్చే ఎలుకా భద్రం!
ఆస్పత్రుల్లో ఎలుకల నివారణకు పిల్లుల పెంపకం
నివేదిక తయారు చేసిన వైద్యులు
తిరుపతి కార్పొషన్: గుంటూరు ప్రభుత్వాస్పత్రి ఘటన నేపథ్యంలో స్థానిక వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఎలుకలపై దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. వాటికి మందుపెట్టి చంపడం కంటే పిల్లులతో ఫుల్స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రభుత్వానికి నివేదించనున్నారు.
తిరుపతి రుయా ఆస్పత్రి, మెటర్నటీ, బర్డ్, స్విమ్స్, ఆయుర్వేధం ఆస్పత్రుల్లో దాదాపు కొన్ని వందల ఎలుకలు ఉన్నట్టు అధికారుల అంచనా. ఆయా ఆస్పత్రుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు, బాలిం తలు, ఇతర రోగులు వైద్యం పొందుతుంటారు. ఆయా వార్డుల్లోని రోగులపై ఎలుకలు ఎక్కడ దాడిచేస్తాయో తెలియని పరిస్థితి. గుంటూరు లాంటి ఘటనలు జరగకముందే ఎలుకలను నివారించాలని భావిస్తున్నారు. పిల్లలతో ఎదురయ్యే ఇబ్బందులను నివారించేందుకు కసరత్తు చేస్తున్నారు.
పిల్లులు పెంచడమే మంచిదా?
తిరుపతిలోని ఎలుకలను చంపేందుకు అనుమతివ్వాలంటూ గతంలో కార్పొరేషన్ అధికారులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎలుకలకు విషమిచ్చి చంపితే అవి డ్రైనేజీ పైపుల్లో, కాలువల్లో చనిపోతాయని, వాటి నుంచి ప్రాణాంతకమైన ప్లేగు వ్యాధి సోకే ప్రమాదముందని అప్పట్లో సున్నితంగా తిరస్కరించింది. ఈనేపథ్యంలో ఎలుకలను ఎలా చంపాలో తెలియని పరిస్థితి. వాటికి విషమిచ్చి చంపడంకంటే ఆస్పత్రుల్లోని వార్డుల్లో పిల్లులను పెంచడం ఉత్తమమని వైద్యాధికారులు భావిస్తున్నారు.