Rohit Behal
-
‘లవ్ యు రామ్’ మూవీ రివ్యూ
టైటిల్: లవ్ యు రామ్ నటీనటులు: రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధనన్, బెనర్జీ, ప్రదీప్, కాదంబరి కిరణ్,మల్లిక్,దశరథ్ తదితరులు నిర్మాణ సంస్థ: మన ఎంటర్టైన్మెంట్, శ్రీ చక్ర ఫిల్మ్స్ నిర్మాతలు: డీవై చౌదరి,దశరథ్ కథ: దశరథ్ దర్శకత్వం: డీవై చౌదరి సంగీతం: వేద సినిమాటోగ్రఫీ: సాయి సంతోష్ విడుదల తేది: జూన్ 30, 2023 కథేంటేంటే.. రామ్ (రోహిత్ బెహల్), నార్వేలో శ్రీనివాస హోటల్స్ అనే బిజినెస్ చైన్ నడుపుతూ ఉంటాడు. జీవితంలో అనేక ఎదురుదెబ్బలు తిని కమర్షియల్ గా మారిపోయిన రామ్ టాక్స్ ఎగ్గొట్టడం కోసం తన దగ్గర ఎలాంటి జీతం తీసుకోకుండా పని చేసేందుకు ఒక వైఫ్ కం ఎంప్లాయ్ కోసం పెళ్లి చూపుల వేట మొదలు పెడతాడు. పార్టనర్ ను చేసుకుంటాను అని చెబుతూ తన బిజినెస్ చైన్ కి సిఈఓగా ఉన్న పీసీ(దశరథ్)ని తనకు తగిన అమ్మాయిని వెతకమని చెబుతాడు. ఈ క్రమంలో ఐదుగురిని సెలెక్ట్ చేసుకోగా వారిలో అతని చిన్ననాటి స్నేహితురాలు దివ్య (అపర్ణ జనార్దనన్) ఎదురవుతుంది. అయితే ఆమె తన చిన్నప్పటి ఫ్రెండ్ అని తెలియక రామ్ ఆమెను బిజినెస్ పరంగా వాడుకోవాలని అనుకుంటాడు. చిన్నప్పుడు రామ్ మాటల వల్లే నలుగురికి సహాయం చేసే గుణం అలవర్చుకున్న దివ్యకి పెళ్లి గంట ఉందనగా రామ్ నిజ స్వరూపం బయట పడుతుంది. మరి రామ్ ను దివ్య పెళ్లి చేసుకుందా? దివ్య తన చిన్ననాటి స్నేహితురాలు అని తెలిసిన రామ్ ఎలా స్పందించాడు? చివరికి వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారా ? లేదా? అనేదే సినిమా కథ. ఎలా ఉందంటే... ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒకరిని ఇష్టపడుతుంది. అతనే ఆ అమ్మాయికి స్ఫూర్తిని ఇచ్చాడు. అలాంటి వ్యక్తి కాలగమనంలో వేరే క్యారెక్టర్ అయిపోయాడని తెలిస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి ? అనేదే ‘లవ్ యు రామ్’ కథ. ఇది ఈ జనరేషన్ లవ్ స్టొరీ. ఇప్పుడు దాదాపు ఎక్కువ ప్రేమలు సోషల్ మీడియాలోనే మొదలవుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా మొబైల్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవడం..ఆ తర్వాత స్నేహం.. కొన్నాళ్లకు ప్రేమలో పడడం జరుగుతుంది. అంతవరకు ఇద్దరి మధ్య విపరీతమైన ప్రేమ ఉంటుంది. కానీ పెళ్లి తర్వాత ఒక్కొక్క నెగిటివ్ లేయర్ బయటపడుతుంది. చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఇలాంటి సమయంలో ఆ ప్రేమకథ పరిస్థితి ఏమిటి ? అనేది ఈ సినిమా ద్వారా చూపించారు. చాలా మంది జీవితాల్లో జరిగే కథ ఇది. ట్రెండింగ్ పాయింట్‌ని కథగా మలిచాడు దర్శకుడు దశరథ్. అయితే దానిని తెరపై చూపించడంలో దర్శకుడు చౌదరి కాస్త తడబడ్డాడు. సినిమా ప్రారంభంలోనే హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించారు. రేటింగ్ ఇస్తూ పెళ్లి కోసం ఆన్లైన్ వేదికగా అమ్మాయిని వెతకడం..ఒక అమ్మాయిని ఫిక్స్ అయి ఇండియా కొస్తే.. ఆమె లేచిపోవడం.. చివరకు హీరోయిన్ ఇంటికి వెళ్లడం..ఆమెతో ప్రేమలో ఉన్నట్లు నటించడం...మధ్య ఇరు కుటుంబాల మధ్య జరిగే సరదా సన్నివేశాలతో చూస్తుండగానే ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. కానీ సెకండాఫ్ తర్వాత కథ రొటీన్‌గా సాగుతుంది. హీరోయిన్ని ఇంప్రెస్ చేయడం కోసం హీరో ప్రయత్నించడం.. వెంటనే అతని నిజస్వరూపం హీరోయిన్‌కి తెలియడం... ఆమె బాధపడడం..మళ్లీ ఒక చాన్స్ ఇవ్వడం..ఇలా రోటీన్‌గా, ఊహకందేలా కథనం సాగుతుంది. క్లైమాక్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. కానీ పీసీ పాత్రలో దశరథ్ చేసే కామెడీ, డబ్బు కోసం అబ్బాయి ఫ్యామిలీ వాళ్లను అమ్మాయి తండ్రి( బెనర్జీ) బురిటీ కొట్టించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎలాంటి అంచాలు లేకుండా వెళ్తే ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ కొంతమేర అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. పెళ్లిని కూడా కమర్షియల్‌గా చూసే రామ్ పాత్రకు రోహిత్ బెహల్ న్యాయం చేశాడు. పల్లెటూరికి చెందిన యువతి దివ్యగా అపర్ణ జనార్ధనన్, చక్కగా నటించింది. ఇక దర్శకుడు దశరథ్ తొలిసారి ఆన్ స్క్రీన్‌పై కనిపించాడు. పీసీ పాత్రలో నటించిన ఆయన.. కామెడీ బాగా పండించాడు. ఆయన వేసే పంచ్ డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. జూదానికి అలవాటు పడి ఇంట్లోనే ఖాలీగా ఉంటున్న భర్తగా బెనర్జీ తన పాత్రలో ఒదిగిపోయాడు. ప్రదీప్, కాదంబరి కిరణ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. వేద నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
దర్శకత్వం కంటే నటన చాలా ఈజీ
‘‘లవ్ యు రామ్’ చిత్రంలో తొలిసారి తప్పని పరిస్థితిలో నేను నటించాల్సి వచ్చింది. నటించే ముందు మొదట ట్రయిల్ షూట్ చేశాం.. అందరికీ నచ్చింది. ఇప్పటివరకూ ప్రీమియర్స్ చూసిన అందరూ బాగా చేశానని అభినందించారు. ఇకపై నటన కొనసాగించాలనుకోవడం లేదు. నటుడిగా సక్సెస్ అయితే మాత్రం దర్శకత్వం కంటే నటనే చాలా ఈజీ (నవ్వుతూ)’’ అని కె. దశరథ్ అన్నారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధనన్ లీడ్ రోల్స్‌లో డీవై చౌదరి దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ యు రామ్’. డైరెక్టర్ కె. దశరథ్ కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా కె. దశరథ్ మాట్లాడుతూ– ‘‘డీవై చౌదరి, నేను మూడు వెబ్ సిరీస్‌లు చేశాం. ఆ తర్వాత ఒక చిన్న లవ్ స్టోరీ చేద్దామని ‘లవ్ యు రామ్’ కథ రాశాను. చాలామంది జీవితాల్లో జరిగే కథ ఇది. పెళ్లి నుంచి శోభనం మధ్యలో జరిగే ప్రేమకథ. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా రూపొందిన మా సినిమా అందర్నీ అలరిస్తుంది. రోహిత్, అపర్ణ అంకితభావంతో పని చేశారు. వేద చాలా మంచి సంగీతం ఇచ్చాడు. ఇండస్ట్రీలో ముందు యండమూరి, పరుచూరి బ్రదర్స్, తేజ గార్ల వద్ద రైటర్‌గా పని చేశాను. కానీ నేను డైరెక్ట్ చేసిన సినిమాల్లో వారి స్టయిల్ ఉండదు. నేను నాలా తీయడానికి ఇష్టపడతాను. కానీ, నేను రచయితగా పని చేసినప్పుడు మాత్రం కస్టమర్ ఈజ్ ది కింగ్. వాళ్లకి ఏం కావాలో అది ఇవ్వాలి. అలా ‘ఉస్తాద్’కి మాస్ కమర్షియల్ కథ అందించాను. ప్రస్తుతం ఒక కొత్త ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అలాగే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. దానికి డైరెక్టర్ హరీష్ శంకర్ షో రన్నర్‌గా ఉంటారు’’ అన్నారు. -
‘ప్రత్యర్థి’ మూవీ రివ్యూ
టైటిల్: ప్రత్యర్థి నటీనటులు: రవి వర్మ, రొహిత్ బెహల్, అక్షత సోనవానె తదితరులు నిర్మాణ సంస్థ : గాలు పాలు డ్రీమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత : సంజయ్ సాహ దర్శకత్వం : శంకర్ ముడావత్ సంగీతం: పాల్ ప్రవీణ్ సినిమాటోగ్రఫీ: రాకేష్ గౌడ్ విడుదల తేది: జనవరి 6, 2022 ‘ప్రత్యర్థి’ కథేంటంటే.. కృష్ణ ప్రసాద్(రవివర్మ) హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్‌లో ఎస్సైగా పని చేస్తుంటాడు. భార్య జయ(సన), కూతురు నిత్య అతనికి దూరంగా ఉంటారు. ఓ సారి తన భర్త విజయ్ కనిపించడం లేదని వైశాలి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కేసు నమోదు చేసుకున్న కృష్ణ ప్రసాద్.. తనదైన స్టైల్లో విచారణ చేపడతాడు. ఈ క్రమంలో విజయ్, వైశాలికి మధ్య గొడవలు జరుగుతున్నాయని, అతనికి రేచల్ అనే ప్రియురాలు ఉందని తెలుస్తుంది. ఈ కోణంలో విచారణ చేపడుతుండగా.. సయ్యద్ అనే ఓ యువకుడు పోలీసు స్టేషన్‌కు వచ్చి.. విజయ్ మిస్ అయిన రోజు రాత్రి ముగ్గురు వ్యక్తులు ముఖానికి మాస్కులు వేసుకొని అతని ఇంట్లోకి వెళ్లడం తాను చూశానని చెబుతాడు. దీంతో విజయ్‌ని చంపింది వీరేనంటూ.. మెకానిక్ ఉద్యోగం చేస్తున్న శివ( రోహిత్ బెహల్), శశి, అశోక్(బల్వీర్ సింగ్)లను అరెస్ట్ చేస్తారు. కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుండగా షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అవేంటి? అసలు విజయ్‌ని ఎవరు హత్య చేశారు? ఈ ముగ్గురికి ఆ హత్యతో నిజంగానే సంబంధం ఉందా? ఆ రోజు రాత్రి ముసుగు వేసుకొని వెళ్లి ఆ ముగ్గురు ఎవరు? ఎందుకు వెళ్లారు? కృష్ణ ప్రసాద్ కూతురు నిత్యను గన్‌తో కాల్చి చంపిందెవరు? నిత్యతో శివకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు నేరస్తుడు ఎవరని తేలింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ల సినిమాలకు ఎప్పుడూ జనాల్లో ఆదరణ ఉంటుంది. సరైన కథ, కథనాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాలు తీస్తే జనాలు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారు. అందుకే ఆ తరహా చిత్రాలను తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన దర్శకత నిర్మాతలు. ‘ప్రత్యర్థి’ కూడా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమే. ఊహించని ట్విస్ట్‌లతో కథనం సాగుతుంది. విజయ్ అనే వ్యక్తి మిస్ అవ్వడం.. అతని భార్య పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కథ ప్రారంభం అవుతుంది. కేసు విచారణలో భాగంగా ఎస్సై పలు రకాలుగా ఊహించడం.. ఆ పాత్రలో కాసెస్టేబుల్ని చూపించడం కొత్తగా అనిపిస్తుంది. అయితే మధ్య మధ్యలో వచ్చే రొమాంటిక్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథకి అడ్డంకిగా అనిపిస్తాయి. అలాగే పలు రకాల పాత్రలు వచ్చి పోవడం గందరగోళంగా అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. చెత్త కుప్పలో విజయ్ శవం దొరికిన తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. ఫస్టాఫ్‌లో అనవరం అనుకున్న ప్రతి సీన్‌కి సెకండాఫ్‌లో క్లారిఫికేషన్ ఇచ్చాడు దర్శకుడు. క్లైమాక్స్‌లో రివీల్ చేసే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. స్క్రీన్‌ప్లేని మరింత పకడ్బందీగా చేసుకొని, పేరున్న నటీనటులను పెట్టుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఎస్సై కృష్ణ ప్రసాద్ పాత్రలో రవివర్మ ఒదిగిపోయాడు. పలు చిత్రాలో చిన్నపాటి పాత్రలు పోషించిన రవి వర్మ.. ఈ చిత్రంలో ఫుల లెన్త్ రోల్ చేశాడు. శివ పాత్రకి రోహిత్ బెహల్ న్యాయం చేశాడు. తెరపై బాలీవుడ్ హీరోలా కనిపించాడు. కానిస్టేబుల్ సత్యగా వంశీ ఆలూర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ప్రైవేట్ డిటెక్టివ్ నిత్యగా అక్షత సోనవానె తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. హీరో స్నేహితుడిగా బల్వీర్ సింగ్ పాత్ర తీరు, కామెడీ ఆకట్టుకుంటుంది. లాయర్ రఘునాథ్ పాత్రలో దివంగత టీఎన్నార్ తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా.. ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తాగుబోతు రమేశ్, వంశీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతి విషయానికొస్తే.. దర్శకుడు శంకర్‌కి ఇది తొలి సినిమా .అయినా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా సినిమాను తెరకెక్కించాడు. ట్విస్టులను క్లైమాక్స్ వరకు రివీల్ చేయకుండా ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెంచడంలో సఫలం అయ్యాడు. పాల్ ప్రవీణ్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. రాకేష్ గౌడ్ కెమెరాపనితనం బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.