టైటిల్: లవ్ యు రామ్
నటీనటులు: రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధనన్, బెనర్జీ, ప్రదీప్, కాదంబరి కిరణ్,మల్లిక్,దశరథ్ తదితరులు
నిర్మాణ సంస్థ: మన ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ చక్ర ఫిల్మ్స్
నిర్మాతలు: డీవై చౌదరి,దశరథ్
కథ: దశరథ్
దర్శకత్వం: డీవై చౌదరి
సంగీతం: వేద
సినిమాటోగ్రఫీ: సాయి సంతోష్
విడుదల తేది: జూన్ 30, 2023
కథేంటేంటే..
రామ్ (రోహిత్ బెహల్), నార్వేలో శ్రీనివాస హోటల్స్ అనే బిజినెస్ చైన్ నడుపుతూ ఉంటాడు. జీవితంలో అనేక ఎదురుదెబ్బలు తిని కమర్షియల్ గా మారిపోయిన రామ్ టాక్స్ ఎగ్గొట్టడం కోసం తన దగ్గర ఎలాంటి జీతం తీసుకోకుండా పని చేసేందుకు ఒక వైఫ్ కం ఎంప్లాయ్ కోసం పెళ్లి చూపుల వేట మొదలు పెడతాడు. పార్టనర్ ను చేసుకుంటాను అని చెబుతూ తన బిజినెస్ చైన్ కి సిఈఓగా ఉన్న పీసీ(దశరథ్)ని తనకు తగిన అమ్మాయిని వెతకమని చెబుతాడు. ఈ క్రమంలో ఐదుగురిని సెలెక్ట్ చేసుకోగా వారిలో అతని చిన్ననాటి స్నేహితురాలు దివ్య (అపర్ణ జనార్దనన్) ఎదురవుతుంది. అయితే ఆమె తన చిన్నప్పటి ఫ్రెండ్ అని తెలియక రామ్ ఆమెను బిజినెస్ పరంగా వాడుకోవాలని అనుకుంటాడు. చిన్నప్పుడు రామ్ మాటల వల్లే నలుగురికి సహాయం చేసే గుణం అలవర్చుకున్న దివ్యకి పెళ్లి గంట ఉందనగా రామ్ నిజ స్వరూపం బయట పడుతుంది. మరి రామ్ ను దివ్య పెళ్లి చేసుకుందా? దివ్య తన చిన్ననాటి స్నేహితురాలు అని తెలిసిన రామ్ ఎలా స్పందించాడు? చివరికి వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారా ? లేదా? అనేదే సినిమా కథ.
ఎలా ఉందంటే...
ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒకరిని ఇష్టపడుతుంది. అతనే ఆ అమ్మాయికి స్ఫూర్తిని ఇచ్చాడు. అలాంటి వ్యక్తి కాలగమనంలో వేరే క్యారెక్టర్ అయిపోయాడని తెలిస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి ? అనేదే ‘లవ్ యు రామ్’ కథ. ఇది ఈ జనరేషన్ లవ్ స్టొరీ. ఇప్పుడు దాదాపు ఎక్కువ ప్రేమలు సోషల్ మీడియాలోనే మొదలవుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా మొబైల్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవడం..ఆ తర్వాత స్నేహం.. కొన్నాళ్లకు ప్రేమలో పడడం జరుగుతుంది. అంతవరకు ఇద్దరి మధ్య విపరీతమైన ప్రేమ ఉంటుంది. కానీ పెళ్లి తర్వాత ఒక్కొక్క నెగిటివ్ లేయర్ బయటపడుతుంది. చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఇలాంటి సమయంలో ఆ ప్రేమకథ పరిస్థితి ఏమిటి ? అనేది ఈ సినిమా ద్వారా చూపించారు. చాలా మంది జీవితాల్లో జరిగే కథ ఇది. ట్రెండింగ్ పాయింట్‌ని కథగా మలిచాడు దర్శకుడు దశరథ్. అయితే దానిని తెరపై చూపించడంలో దర్శకుడు చౌదరి కాస్త తడబడ్డాడు.
సినిమా ప్రారంభంలోనే హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించారు. రేటింగ్ ఇస్తూ పెళ్లి కోసం ఆన్‌లైన్ వేదికగా అమ్మాయిని వెతకడం..ఒక అమ్మాయిని ఫిక్స్ అయి ఇండియా కొస్తే.. ఆమె లేచిపోవడం.. చివరకు హీరోయిన్ ఇంటికి వెళ్లడం..ఆమెతో ప్రేమలో ఉన్నట్లు నటించడం...మధ్య ఇరు కుటుంబాల మధ్య జరిగే సరదా సన్నివేశాలతో చూస్తుండగానే ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. కానీ సెకండాఫ్ తర్వాత కథ రొటీన్‌గా సాగుతుంది. హీరోయిన్‌ని ఇంప్రెస్ చేయడం కోసం హీరో ప్రయత్నించడం.. వెంటనే అతని నిజస్వరూపం హీరోయిన్‌కి తెలియడం... ఆమె బాధపడడం..మళ్లీ ఒక చాన్స్ ఇవ్వడం..ఇలా రోటీన్‌గా, ఊహకందేలా కథనం సాగుతుంది. క్లైమాక్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. కానీ పీసీ పాత్రలో దశరథ్ చేసే కామెడీ, డబ్బు కోసం అబ్బాయి ఫ్యామిలీ వాళ్లను అమ్మాయి తండ్రి( బెనర్జీ) బురిటీ కొట్టించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎలాంటి అంచాలు లేకుండా వెళ్తే ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ కొంతమేర అలరిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
పెళ్లిని కూడా కమర్షియల్‌గా చూసే రామ్ పాత్రకు రోహిత్ బెహల్ న్యాయం చేశాడు. పల్లెటూరికి చెందిన యువతి దివ్యగా అపర్ణ జనార్ధనన్, చక్కగా నటించింది. ఇక దర్శకుడు దశరథ్ తొలిసారి ఆన్ స్క్రీన్‌పై కనిపించాడు. పీసీ పాత్రలో నటించిన ఆయన.. కామెడీ బాగా పండించాడు. ఆయన వేసే పంచ్ డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. జూదానికి అలవాటు పడి ఇంట్లోనే ఖాలీగా ఉంటున్న భర్తగా బెనర్జీ తన పాత్రలో ఒదిగిపోయాడు. ప్రదీప్, కాదంబరి కిరణ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. వేద నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment