rohit sekhar
-
దూరపు చుట్టంతో ఎఫైర్.. పెళ్లికి ముందే కొడుకు!
న్యూఢిల్లీ: రోహిత్ శేఖర్ తివారీ హత్యకేసులో అరెస్టయిన అతని భార్య అపూర్వ శుక్లా పోలీసుల విచారణలో సంచలన నిజాలు బయటపెట్టారు. తన భర్తకు పెళ్లిముందే ఒక కొడుకు ఉన్నాడని, ఆ కొడుకునే ఆయన ఆస్తికి వారసుడిని చేయాలని భావించారని, అందుకే రోహిత్‌ను చంపేసినట్టు ఆమె పోలీసుల ఎదుట అంగీకరించారు. రెండురోజుల పోలీసు రిమాండ్‌లో ఉన్న ఆమె తన వైవాహిక జీవితం, రోహిత్‌తో ఎదురైన సమస్యలు.. హత్యకు దారితీసిన పరిస్థితులు క్షుణ్నంగా పూస గుచ్చినట్టు వివరించారు. రోహిత్ శేఖర్ తివారీ, అపూర్వ శుక్లాల పెళ్లి ఫొటో రోహిత్‌కు పెళ్లి ముందునుంచే వివాహేతర సంబంధం ఉండటం తనను తీవ్రంగా దహించివేసిందని, అతనికి ఓ దూరపు చుట్టమైన మహిళతో అత్యంత సాన్నిహిత్యం ఉందని ఆమె పోలీసులకు తెలిపారు. ‘ఆ మహిళ తన కొడుకు రోహిత్ ఆస్తిలో వాటా ఇవ్వాలని తరచూ కోరేది. మీ ఇంటి కొడుకే కదా అని తరచూ అంటుండేది. రోహిత్ కూడా ఆ పిల్లాడిపై ప్రేమ, ఆప్యాయతలు ఉండటం నా అనుమానాలను పెంచింది’ అని ఆమె తెలిపింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన అపూర్వ తాను తరచూ ఇండోర్, ఢిల్లీ మధ్య పర్యటించేదానినని, ఇండోర్ జిల్లా కోర్టుతోపాటు సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తుండటంతో అనంతరం ఢిల్లీకి మారానని ఆమె తెలిపారు. రాజకీయ ఆశయాలు ఉండటంతో మాట్రిమోనియల్ సైట్లో దివంగత నాయకుడు ఎన్డీ తివారీ కొడుడైన శేఖర్ తివారీ ప్రొఫైల్‌ను చూడగానే ఎంచుకున్నానని, ఆ తర్వాత కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత 2018 మే 11న తాము పెళ్లి చేసుకున్నామని, కానీ, తమ వైవాహిక జీవితం ఎక్కువరోజులు నిలబడలేదని, అత్తింటివారితో సరిపడకపోవడంతో అదే ఏడాది మే 29న అత్తింటిని వీడి వచ్చానని ఆమె తెలిపారు. అనంతరం జులైలోనే రోహిత్‌కు విడాకుల నోటీసులు పంపానని, కానీ, హృదయ సంబంధ వ్యాధితో అతను ఆస్పత్రిలో చేరడంతో అతన్ని పరామర్శించాక.. తమ అనుబంధాన్నికొనసాగించాలని భావించానని ఆమె తెలిపారు. అత్త ఉజ్వల సింగ్ కూడా తరచూ తనను వేధించేదని, ఆమె అనుమతి లేకుండా కనీసం బెడ్రూమ్ కర్టైన్ కూడా మార్చనిచ్చేది కాదని అపూర్వ తెలిపారు. అంతేకాకుండా రోహిత్ తండ్రి అతనికి వారసత్వంగా ఆస్తులేవీ ఇచ్చి వెళ్లలేదని, ఢిల్లీ ఢిపెన్స్ కాలనీలోని నివాసం కూడా అతని తల్లిదేనని అపూర్వకు తెలియడం ఆమెలో కోపాన్ని మరింత పెంచిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ‘రోహిత్ క్రూరంగా ప్రవర్తించేవాడు. అతను నన్ను ప్రేమించలేదు. మేం ఎప్పుడు అతని ఎఫైర్ గురించి గొడవపడేవాళ్లం. సర్దిచెప్పడానికి బదులు ఆ అఫైర్ గురించి అతను గొప్పలు చెప్పుకునేవాడు. అందుకే అతన్ని నేను చంపేశా’ అని అపూర్వ పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించింది. -
గృహనిర్బంధంలో ఎన్డీ తివారీ?
కాంగ్రెస్ కురువృద్ధుడు నారాయణ దత్త తివారీ గృహనిర్బంధంలో ఉన్నారా? అవుననే అంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నేత అలనాటి ప్రేయసి, కాంగ్రెస్ నేత ఉజ్వల శర్మ, ఆమె కుమారుడు రోహిత్ శేఖర్. వారు 88 ఏళ్ల నేతను కలిసేందుకు వెళ్తే అధికారులు వారిని ఆపేశారు. దాంతో ఆమె ఇనుప గేటు బద్దలు గొట్టి మరీ అనుచరులతో సహా లోపలికి వెళ్లారు. లక్నోలో శుక్రవారం ప్రజలకు ఈ వివాదం పెద్ద వినోదంగా మారింది. 'తివారీ అనారోగ్యంగా ఉన్నారు. ఆయనకు సహాయం అవసరం. కాబట్టి నేను లోపలికి వెళ్లాల్సిందే. అసలు ఇదంతా ఒక కుట్ర. ఆయనని గృహనిర్బంధంలో ఉంచినట్టుగా ఉంది.' అని 70 ఏళ్ల ఉజ్వల వాదించారు. ఉజ్వలతో తివారీకి వివాహేతర సంబంధం ద్వారా రోహిత్ శేఖర్ జన్మించారు. అయితే చాలా కాలం తివారీ ఈ విషయాన్ని అంగీకరించలేదు. చివరికి కోర్టు బలవంతంగానైనా డీఎన్ ఏ పరీక్ష చేయించాలని ఆదేశించడంతో తివారీ రోహిత్ తన పుత్రుడేనని అంగీకరించారు. ఈ సంఘటన జరిగిన ఇరవై రోజుల తరువాత నుంచీ తనను తివారీని కలవనీయకుండా నిర్బంధాలు పెరుగుతున్నాయని ఉజ్వల ఆరోపిస్తున్నారు. 'నాకు తివారీ ఆస్తిపాస్తులు వద్దు. ఆయన జీవన సంధ్యా కాలంలో కాసింత సేవచేసుకునే అవకాశం కల్పించండి' అని ఆమె అన్నారు. అయితే తివారీ ఆదేశాల మేరకే తాము ఆమెను నిరోధించామని పోలీసులు చెబుతున్నారు. -
రోహిత్ నా కుమారుడే.. : ఎన్డీ తివారీ
పితృత్వం కేసులో దిగివచ్చిన ఎన్డీ తివారీ న్యూఢిల్లీ: పితృత్వం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ ఎట్టకేలకు దిగివచ్చారు. రోహిత్ శేఖర్ తన కన్న కుమారుడే అని ఆయన బహిరంగంగా అంగీకరించారు. 88 ఏళ్ల ఎన్డీ తివారీ సోమవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. దీంతో ఈ అంశంపై సుదీర్ఘంగా సాగిన న్యాయపోరాటానికి తెరపడినట్లయింది. ‘నేను అతడి(రోహిత్)ని నా కుమారునిగా అంగీకరిస్తున్నా. అతని డీఎన్ఏ నా డీఎన్ఏ సరిపోలడంతో రెండేళ్ల క్రితమే ఈ విషయం నిర్ధారణ అయ్యింది. దీనిపై ఇక ఏ వివాదమూ ఉండదని భావిస్తున్నా’ అని తివారీ చెప్పారు. రోహిత్ తన కుమారుడే అని హైకోర్టులో సైతం అంగీకరిస్తానని చెప్పారు. అయితే రోహిత్‌ను చట్టబద్ధమైన వారసునిగా అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు తివారీ సమాధానం దాటవేశారు. మరోవైపు తివారీ నిజాయితీపై రోహిత్ అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. ఇది తన జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజని, తివారీ నిజాన్ని అంగీకరించాలని, తన తల్లికి సరైన గౌరవం ఇవ్వాలనే తాను న్యాయపోరాటం చేశానని రోహిత్ చెప్పారు. తివారీ ప్రకటనతో సంతృప్తి చెందారా అని ప్రశ్నించగా.. ఆయన నిజాయితీపై తనకు కొన్ని అనుమానాలున్నాయన్నారు. మరోవైపు ఉజ్వలశర్మ కూడా తివారీ ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారు. తాము తివారీ ఆస్తిలో హక్కు కోసం పోరాటం చేయలేదన్నారు.