రోహిత్ నా కుమారుడే.. : ఎన్డీ తివారీ
పితృత్వం కేసులో దిగివచ్చిన ఎన్డీ తివారీ
న్యూఢిల్లీ: పితృత్వం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ ఎట్టకేలకు దిగివచ్చారు. రోహిత్ శేఖర్ తన కన్న కుమారుడే అని ఆయన బహిరంగంగా అంగీకరించారు. 88 ఏళ్ల ఎన్డీ తివారీ సోమవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. దీంతో ఈ అంశంపై సుదీర్ఘంగా సాగిన న్యాయపోరాటానికి తెరపడినట్లయింది. ‘నేను అతడి(రోహిత్)ని నా కుమారునిగా అంగీకరిస్తున్నా. అతని డీఎన్‌ఏ నా డీఎన్‌ఏ సరిపోలడంతో రెండేళ్ల క్రితమే ఈ విషయం నిర్ధారణ అయ్యింది. దీనిపై ఇక ఏ వివాదమూ ఉండదని భావిస్తున్నా’ అని తివారీ చెప్పారు.
రోహిత్ తన కుమారుడే అని హైకోర్టులో సైతం అంగీకరిస్తానని చెప్పారు. అయితే రోహిత్‌ను చట్టబద్ధమైన వారసునిగా అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు తివారీ సమాధానం దాటవేశారు. మరోవైపు తివారీ నిజాయితీపై రోహిత్ అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. ఇది తన జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజని, తివారీ నిజాన్ని అంగీకరించాలని, తన తల్లికి సరైన గౌరవం ఇవ్వాలనే తాను న్యాయపోరాటం చేశానని రోహిత్ చెప్పారు. తివారీ ప్రకటనతో సంతృప్తి చెందారా అని ప్రశ్నించగా.. ఆయన నిజాయితీపై తనకు కొన్ని అనుమానాలున్నాయన్నారు. మరోవైపు ఉజ్వలశర్మ కూడా తివారీ ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారు. తాము తివారీ ఆస్తిలో హక్కు కోసం పోరాటం చేయలేదన్నారు.