గృహనిర్బంధంలో ఎన్డీ తివారీ?
గృహనిర్బంధంలో ఎన్డీ తివారీ?
Published Sat, May 3 2014 12:32 PM | Last Updated on Fri, Sep 28 2018 8:12 PM
కాంగ్రెస్ కురువృద్ధుడు నారాయణ దత్త తివారీ గృహనిర్బంధంలో ఉన్నారా? అవుననే అంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నేత అలనాటి ప్రేయసి, కాంగ్రెస్ నేత ఉజ్వల శర్మ, ఆమె కుమారుడు రోహిత్ శేఖర్. వారు 88 ఏళ్ల నేతను కలిసేందుకు వెళ్తే అధికారులు వారిని ఆపేశారు. దాంతో ఆమె ఇనుప గేటు బద్దలు గొట్టి మరీ అనుచరులతో సహా లోపలికి వెళ్లారు.
లక్నోలో శుక్రవారం ప్రజలకు ఈ వివాదం పెద్ద వినోదంగా మారింది. 'తివారీ అనారోగ్యంగా ఉన్నారు. ఆయనకు సహాయం అవసరం. కాబట్టి నేను లోపలికి వెళ్లాల్సిందే. అసలు ఇదంతా ఒక కుట్ర. ఆయనని గృహనిర్బంధంలో ఉంచినట్టుగా ఉంది.' అని 70 ఏళ్ల ఉజ్వల వాదించారు.
ఉజ్వలతో తివారీకి వివాహేతర సంబంధం ద్వారా రోహిత్ శేఖర్ జన్మించారు. అయితే చాలా కాలం తివారీ ఈ విషయాన్ని అంగీకరించలేదు. చివరికి కోర్టు బలవంతంగానైనా డీఎన్ ఏ పరీక్ష చేయించాలని ఆదేశించడంతో తివారీ రోహిత్ తన పుత్రుడేనని అంగీకరించారు. ఈ సంఘటన జరిగిన ఇరవై రోజుల తరువాత నుంచీ తనను తివారీని కలవనీయకుండా నిర్బంధాలు పెరుగుతున్నాయని ఉజ్వల ఆరోపిస్తున్నారు.
'నాకు తివారీ ఆస్తిపాస్తులు వద్దు. ఆయన జీవన సంధ్యా కాలంలో కాసింత సేవచేసుకునే అవకాశం కల్పించండి' అని ఆమె అన్నారు. అయితే తివారీ ఆదేశాల మేరకే తాము ఆమెను నిరోధించామని పోలీసులు చెబుతున్నారు.
Advertisement