మామ్‌బినేషన్
డిజైనర్ కాలమ్!
అమ్మాయి నట్టింట తిరుగాడుతుంటే అమ్మకు కనుల నిండా పండగ. అమ్మ-అమ్మాయి కలిసి ఒకే కాంబినేషన్ దుస్తులు ధరిస్తే చూసే కనులదే అసలైన పండగ. మహిళా దినోత్సవం రానున్న వేళ... అమ్మ, అమ్మాయి ధరించే డ్రెస్ కాంబినేషన్ల ‘ఎంపవర్మెంట్’ గురించి ప్రముఖ డిజైనర్ భార్గవి కూనమ్ చెబుతున్న ఆసక్తికరమైన విశేషాలు... మీ కోసం.
తల్లీ-కూతురు ఒకేలా మ్యాచింగ్ డ్రెస్ ధరించడం విదేశాలలో ఎక్కువగా ఉంది. సందర్భం లేకపోయినా బయటికి వెళుతున్నారంటే చాలు ఇద్దరూ ఒకేలా వస్త్రధారణ చేసుకోవాలనే ఆసక్తి కనబరుస్తారు. ఈ తరహా డ్రెస్సింగ్ వల్ల నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ మన దగ్గరా నడుస్తోంది. ముఖ్యంగా ఇటీవల సంప్రదాయ వేడుకల్లో ఈ ట్రెండ్ చాలా పాపులర్ అయ్యింది. చాలాచోట్ల తల్లీకూతుళ్లు ఒకే కాంబినేషన్లో దుస్తులు ధరించి వేడుకలో వైవిధ్యంగా, ఆక ర్షణీయంగా వెలిగిపోతూ కనిపిస్తున్నారు.
రంగుల ఎంపికే ప్రధానం
వేడుకల్లో మహిళలు రెట్టింపు అందంతో మెరిసిపోవాలనుకుంటారు. అందుకే చాలా మంది విభిన్నమైన రంగుల కాంబినేషన్‌ని కోరుకుంటారు. వారి ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని ఒక డిజైనర్‌గా ఎక్కువ కాంతిమంతమైన రంగులను నేను ఎంచుకుంటాను. వాటిని బ్యాలెన్స్ చేస్తూ లేత రంగులను ఉపయోగిస్తాను. ఈ రెండురకాల ఫ్యాబ్రిక్‌ను కలుపుతూ ఎంబ్రాయిడరీపైన దృష్టిపెడతాను.
హుందాతనం
అమ్మ హుందాతనానికి ప్రతీక. కలర్‌ఫుల్‌గానే కాదు సింపుల్‌గా, స్మార్ట్‌గా కనిపించడం మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టాలి. మంచి కాంతిమంతమైన రంగులు గల చీరలను ఎంచుకున్నప్పుడు వాటి మీదకు ధరించే ఆభరణాల ఎంపిక తక్కువ ఉండాలి. (పై ఫొటోలో రోజా, ఆమె కూతురు అన్షుల డ్రెస్సింగ్ కాంబినేషన్ ఒకేలా ఉన్నా కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఒక వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. కూతురు బంగారు నగ వేసుకుంటే, రోజా సింపుల్‌గా కనిపించడానికి ముత్యాలు ధరించారు).
సౌకర్యంగా ఉండాలి.
పిల్లల డ్రెస్సులను రూపొందించడానికి ముందు అవి వారికి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా జాగ్రత్తపడాలి. ఒంటికి గుచ్చుకోని విధంగా ఆభరణాలు, మెత్తగా ఉండే ఫ్యాబ్రిక్‌తో డిజైనర్ దుస్తులు ఉండాలి. లేదంటే ఆ దుస్తులకు పిల్లలు దూరంగా ఉండే అవకాశం ఉంది. మెత్తటి క్రేప్, రా సిల్క్, బెనారస్ పట్టు, మల్ మల్ లైట్ వెయిట్ మెటీరియల్‌ను ఈ తరహా దుస్తుల డిజైన్‌కు ఎంపిక చేసుకోవాలి. అలాగే హెవీ వర్క్స్ లేకుండా కలర్స్పైనే ఎక్కువ దృష్టి పెడతాను. (ఇక్కడ రోజా ధరించిన చీరకు కుందన్స్‌తో డిజైన్ చేసిన బార్డర్ జత చేస్తే, ఆమె కూతురు ఓణీకి కడ్డీ అంచును జత చేశాం). ఏ డ్రెస్సింగ్ అయినా పిల్లలకు పెద్దగా మేకప్ అవసరం లేదు. కొద్దిగా హెయిర్‌స్టైల్ విషయంలో జాగ్రత్త తీసుకుంటే చాలు అందంగా కనిపిస్తారు.
వేడుకను బట్టి థీమ్...
ఇప్పుడన్నింటా ఈ విధానమే కొనసాగుతోంది. పెళ్లికైతే వధువు-వరుడు ఒకే కలర్ కాంబినేషన్‌తో ఆకట్టుకునేలా ఉండటానికి డిజైన్ చేస్తాం. అదే పుట్టినరోజు, ఉయ్యాల వేడుక.. ఇలా పిల్లలతో ముడిపడి ఉన్న ఫంక్షన్లన్నీ ఒకే కలర్ కాంబినేషన్ అనేది ప్రధానాంశంగా నడుస్తోంది. కొన్నాళ్లుగా హాఫ్ శారీస్ (డిజైనర్ లంగా ఓణీలు) బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. వేడుకలో కళను రెట్టింపు చేసేవాటిలో ఇవే ముందువరసలో ఉన్నాయి. అందుకే వేడుక అనగానే చాలామంది లంగా ఓణీలవైపే చూస్తున్నారు. కాబట్టి అమ్మాయిలకు డిజైనర్ లంగా ఓణీ ఎంపిక చేస్తే.. అదే తరహా రంగులతో ఆకట్టుకునేలా ఉన్న చీర అమ్మాయి అమ్మకు సరిగ్గా నప్పుతుంది.
ప్రెజెంటేషన్: నిర్మలారెడ్డి
భార్గవి కూనమ్