ప్రకృతి వి‘చిత్రం’
నెవడాలోని ఈ వాతావరణ విచిత్రాన్ని రాల్ఫ్ మేడెర్ అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. నెవడాలోని మోరాన్ పాయింట్ వద్ద తీసిన ఫొటో ఇది. వేసవి ముగిసే తరుణంలో అధిక ఉష్ణోగ్రతలు వాతావరణంలోని తేవుతో కలసి, స్థానిక తుపానులకు దారితీస్తాయి.. అలాంటి తుపాను వచ్చే ముందు ఇలా ఆకాశంలో మబ్బులు, మెరుపులు కనిపిస్తాయి.
‘పుర్రె’కో బుద్ధి!
వెల్వియిన్ గార్డెన్ సిటీకి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ జెర్మీ గిబ్స్కు తన ఇంటి పరిసరాలను సృజనాత్మకంగా తీర్చిదిద్దడమంటే మహా సరదా. అందుకే గార్డెన్‌లోని మొక్కలను ఇలా రకరకాల జంతువుల చేతులు, మనిషి పుర్రె ఆకృతిలో కత్తిరించి తన ఇంటికే కొత్త అందాన్ని తీసుకొస్తున్నాడు. గత 20 ఏళ్లుగా ఇలా విభిన్న ఆకృతుల్లో తన ఇంటి పరిసరాలను రూపొందిస్తున్న ఈ డాక్టర్ అందరినీ తన అరుదైన కళతో అబ్బురపరుస్తున్నాడు.
ఆకాశంలో ఆలయం..
అపార్ట్‌మెంట్లపైన పెంట్ హౌస్‌లు కట్టుకోవడం మనం చూశాం. చైనాలో మాత్రం ఇలా ఏకంగా ఆలయాన్నే కట్టేశారు. షెంజెన్ నాన్ఫాంగ్ జిల్లాలో 21 అంతస్తులున్న ఓ ఆకాశహర్మ్యంపైన నిర్మితమైన ఆలయమిది. అయితే, ఇది ఎవరో ప్రైవేటు వ్యక్తులకు చెందినదని భావిస్తున్నారు. చైనాలో ఈ మధ్య అక్రమంగా రూఫ్‌టాప్ నిర్మాణాలు కట్టడం ఎక్కువైపోయింది. ఇది కూడా అలాంటి బాపతేనని అనుమానిస్తున్నారు.
పాతవాటితో ప్రజలకు పాఠం..
జర్మనీలో విద్యుత్‌ను వేస్ట్ చేయడం బాగా ఎక్కువైపోయిందట. దీంతో ఆ దేశానికి చెందిన రాల్ఫ్ స్కీమర్బెర్గ్ అనే ఆర్టిస్ట్ ప్రజలకు దీనిపై అవగాహన కల్పించేందుకు ఈ వినూత్న ఇగ్లూను నిర్మించారు. ఇగ్లూను మంచుతో తయారుచేస్తారన్నది మనకు తెలిసిందే. దీన్ని చేయడానికి మాత్రం ఆయన 322 పాత ఫ్రిడ్జ్‌లను వాడారు. పైగా.. ఇవి ఎంత విద్యుత్‌ను ఖర్చు పెడుతున్నాయన్న విషయాన్ని తెలియజేయడానికి బయటో కరెంట్ మీటర్‌ను కూడా పెట్టారు.