కూలీకి వెళ్లి మృత్యు ఒడికి..
గూడూరు: పొట్ట కూటి కోసం కూలీ పనులకు వెళ్లి ఆటో బోల్తా పడడంతో ఓ మహిళ మృత్యు ఒడి చేరింది. ఈ ఘటలో నలుగురు మహిళలు గాయపడ్డారు. మండలంలోని జూలకల్లు వద్ద బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సి.బెళగల్ మండలం పొలకల్లు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు 20 మంది ఆటోలో గూడూరు మండలంలోని మునుగాల గ్రామానికి చెందిన హనుమంతు పొలంలో మిరప పండు తెంపడానికి వెళ్లారు. పని ముగిసిన తరువాత కూలీలంతా అదే ఆటోలో స్వగ్రామమైన పోలకల్లుకు బయలు దేరారు. జూలకల్లు సమీపంలో ఎదురుగా వస్తున్న ఓ బైక్‌ను తప్పించే ప్రయత్నంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఒకరిపై ఒకరు పడి గాయపడ్డారు. ఇందులో బోయ సోమలమ్మ (55) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా బోయ పార్వతమ్మ, బోయ అంజనమ్మ, బోయ నాగలక్ష్మిలకు తీవ్రగాయలకు గురయ్యారు. సంఘటన ప్రాంతానికి పోలీసులు చేరుకుని గాయపడ్డ వారిని గూడూరు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.