వరద ఉధృతితో వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు
నల్లబెల్లి(వరంగల్): వరద ఉధృతితో ఆర్టీసీ బస్సు బోల్తాపడిన పడిన ఘటన నల్లబెల్లి శివారులో గురువారం చోటుచేసుకుంది. ప్రయాణికుల కథనం ప్రకారం.. ములుగు నుంచి నర్సంపేకు 30 మందితో నర్సంపేట డిపోకు చెందిన బస్సు సాయంత్రం బయలుదేరింది. నల్లబెల్లి మధ్యలవాగు వద్దకు చేరుకొగానే అప్పటికే కురిసిన భారీ వర్షంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. డ్రైవర్ అంకూస్ బస్సును వాగుదాటేంచే ప్రయత్నం చేస్తుండగా గుంతలోకి వెళ్లి అదుపుతప్పి పడిపోయింది. ప్రయాణికులు హాహాకారాలు చేయడంతో వాగు సమీపంలో ఉన్న వారు అక్కడికి చేరుకొని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో శనిగరం గ్రామానికి చెందిన కక్కెర్ల శ్రీధర్‌కు కాలుకు తీవ్రంగా, మరికొందరు ప్రయాణికులకు భుజం, తల, కాళ్లకు గాయాలయ్యాయి. ఎస్సై మేరుగు రాజమౌళి ఘటన స్థలాన్ని పరిశీలించారు. తీవ్రగాయాలైన శ్రీధర్‌ను 108లో నర్సంపేట ఆస్పత్రికి తరలించారు.
తృటిలో తప్పిన పెను ప్రమాదం..
కాజ్‌వేపై వెళ్లుతున్న బస్సు గుంతలో పడిన విషయాన్ని గమనించిన డ్రైవర్ అంకూస్ బ్రేకులు వేస్తూ అదుపు చేసేందుకు ప్రయత్నించినట్లు ప్రయాణికులు తెలిపారు. గుంతలమయమైన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పలువురు మండిపడ్డారు. కాగా సంఘటన స్థలాన్ని ఆర్టీసీ నర్సంపేట డీఎం మధుసూదన్, సీఐ శ్రీకాంత్, ఎంపీపీ బానోత్ సారంగపాణి తదితరులు పరిశీలించారు. గాయపడిన శ్రీధర్‌కు తమ సంస్థ మెరుగైన వైద్యసేవలు, ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకొంటామని డీఎం మధుసూదన్ తెలిపారు. సహాయక చర్యల్లో మూడుచెక్కలపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పలుకాల తిరుపతిరెడ్డి, బత్తిని రమేష్, రాజుకుమార్, మర్రి రాజు, ఎండీ షబ్సీర్, పెద్దబోయిన బిక్షపతి, పిండి హరీష్, మేకల ప్రశాంత్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, నల్లబెల్లి ఎంపీటీసీ సభ్యుడు నానెబోయిన రాజారాం, తౌటురెడ్డి రాజిరెడ్డి, మామిండ్ల రాజిరెడ్డి పాల్గొన్నారు.