గ్రీష్మంలో వసంతం క్రిస్మస్ సంబరం
రాక్షసత్వానికి మారుపేరుగా ప్రసిద్ధి చెందిన సీజర్ ఆగస్టస్ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులవి. రోమా సామ్రాజ్యం నాటి సామ్రాజ్యా లన్నిటిలోకల్లా అతి విశాలమైనది మాత్రమే కాదు... ఎంతో బలమైనది, సంపన్నమైనది కూడా. అలాంటి రోమా సామ్రాజ్యంలో ఒక మూలన ఉన్న యూదా రాజ్యంలోని బెత్లెహేము పురంలో... ఒక పశువుల పాకలో... ఒక నాటి రాత్రి యోసేపు, మరియల తనయుడుగా దైవకుమారుడు యేసుక్రీస్తు జన్మించాడు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా చరిత్రను రెండు ప్రధాన విభాగాలుగా విడదీసిన ‘యేసుక్రీస్తు జననం’ అలా రెండు వేల ఏళ్ల క్రితం జరిగింది.
కొత్త పన్నులు విధించి ప్రజల్ని మరింత పీడించడానికి సీజర్ ఆగస్టస్ జనసంఖ్య తీయాలని ఆదేశిస్తే, యోసేపు మరియలు తాముంటున్న గలిలయ ప్రాంతపు గ్రామమైన నజరేతును వదలి రెండొందల కిలోమీటర్ల దూరంలోని బెత్లెహేము పురానికి జనాభా లెక్కల్లో తమ పేర్లు నమోదు చేయించుకోవడానికి వచ్చారు. ఎందుకంటే యోసేపు దావీదు వంశానికి చెందినవాడు. దావీదు వంశీయులు బెత్లెహేము పురానికి చెందిన వారు.
ప్రపంచ చరిత్రలోనే అది మొట్ట మొదటి ప్రజాసంఖ్య కాగా, అందులో యోసేపు మరియలే కాదు వారికి కుమారుడుగా జన్మించిన యేసుక్రీస్తు పేరు కూడా నమోదయింది. ఆ జనసంఖ్య తాలూకు ప్రతులు రోమా సామ్రాజ్య పతనం తరువాత కూడా రోమ్‌లో తొమ్మిదవ దశాబ్దం దాకా భద్రంగా ఉంచారు. కాని ఆ తరువాత సంభవించిన భూకంపం తాలూకు ఒక పెద్ద అగ్ని ప్రమాదంలో ఆ ప్రతులు కాలిపోయాయి.
మానవుణ్ని దేవుడిగా మార్చి, ఆయన స్థాయికి ఎదిగేలా చేసిన ఎన్నో మతాలు చరిత్రలో ఉన్నాయి. కాని దేవుడే మానవ శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన అపూర్వమైన సంఘటన ఇది. దేవుడు మానవుడుగా మారాలనుకొని పరలోకాన్ని వదిలి ఈ లోకానికి రావాలనుకోవడం, జనన మరణాలకు అతీతుడైన దేవుడు భూలోకంలోని ఇద్దరు నిరుపేద భార్యా భర్తలకు కుమారుడుగా జన్మించి, కేవలం ముప్ఫై మూడున్నర సంవత్సరాల పాటు ఈ లోకంలో జీవించి, సిలువలో మరణించాలనుకోవడం అపూర్వమే కాదు, అనూహ్యం కూడా! యేసుక్రీస్తు రాకతో ఈ లోకానికి నవోదయమైంది, కాని పరలోకం చిన్నబోయింది.
పరలోక సౌఖ్యం, వైభవం వదలి క్రీస్తు నరలోకానికి ఎందుకు వెళ్లా లనుకున్నాడో అక్కడి దేవదూతలకు కూడా అర్థం కాలేదు. వాళ్లంతా ఎంతో విస్మయం చెందారు. కానీ క్రీస్తు భూమిపై జన్మించడానికి కారణం ఉంది. అది తండ్రి నిర్ణయం. తన కుమారుడి ద్వారా ఈ లోకంలో వెలుగును, ప్రేమను నింపాలన్నది ఆయన కాంక్ష. అలా క్రిస్మస్తో ఈ లోకంలోనే నవశకం ఆరంభమైంది.
యేసుక్రీస్తు జీవితం, పరిచర్య సందేశాల పరిమళం, ఆయన పునరుత్థానం, పరలోకారోహణం, తరువాత ఆయన శిష్యుల ద్వారా లోకం నలుమూలలకూ వ్యాపించింది. అలా క్రూరత్వానికి ప్రతీక అయిన సీజర్ ఆగస్టస్ పాలనా కాలమే కరుణామయుడు, క్షమాపణాధీశుడైన యేసుక్రీస్తు జననానికి అనువైన సమయంగా దేవుడు ఎంపిక చేసుకోవడం గమనార్హం.
అప్పటికే సీజర్ పాలనా దౌర్జన్యంతో కకావికలమైపోయిన సామాన్యులు, బీదలు, నిరాశ్రయుల జీవితాల్లో యేసుక్రీస్తు ప్రేమ సందేశాలు తొలకరి జల్లుల్లా ఆనందాన్ని నింపాయి. ‘నిన్ను వలె నీ పొరుగువాణ్ని ప్రేమించు’ అన్న క్రీస్తు సందేశం, ఆ మేరకు ఆయన జీవించిన జీవితం... ‘పీడించు’, ‘దండించు’, ‘దోచుకో’ అన్న నాటి పరిస్థితులను ప్రతిబింబించే పదాలకు ప్రత్యామ్నాయమై ప్రతిధ్వనించింది.
అయితే జలపాతంలా, ఉధృత ప్రవాహంలా పట్టరాని శక్తితో విజృం భిస్తున్న క్రూరత్వం, దోపిడీ, నియంతృ త్వాన్ని పరమ సాత్వికుడు, మితభాషి, సరళస్వభావి, అహింసావాది, శత్రువు ఒక చెంపన కొడితే మరో చెంప చూపించ మన్న క్షమాపణా తాత్వికుడైన, నిరా యుధుడైన యేసుక్రీస్తు ఎదుర్కొని నిలబడగలడా అన్న ప్రశ్న ఆనాడే ఉత్పన్నమైంది. అయితే హింసను ఎదుర్కొనే అత్యంత ప్రతిభా వంతమైన ఆయుధం ప్రేమ మాత్రమేనని యేసుక్రీస్తు నిరూపించాడు.
చీకటి ఎంత గాఢంగా, శక్తివంతంగా ప్రబలి వున్నా ఒక చిరుదీపం చాలు దాన్ని పారదోలడానికి. ఒక్కోసారి వరద ప్రవాహం ఉధృతిలో మహా భవనాలు, మహా వృక్షాలు కొట్టుకుపోతాయి. కాని తలవంచడమే స్వభావంగా ఉన్న గడ్డిపరకలు నిలదొక్కుకుంటాయి. రెండువేల ఏళ్లుగా ‘క్రిస్మస్’ ద్వారా యేసుక్రీస్తు అందిస్తున్న సందేశం అదే.
ఒక ఉదంతం పండగగా పరిణ మించడంలోని ఒక ప్రమాదం ఏమిటంటే కాలక్రమంలో సందేశం మూలన పడి ‘సెలబ్రేషన్’ మాత్రమే మిగులుతుంది. పండుగలన్నింటిలాగే క్రిస్మస్లో కూడా వాణిజ్య విషసంస్కృతి తాలూకు దుష్ర్పభావం కనిపిస్తోంది. ప్రేమ సందేశాన్ని ఎలా పాటించాలి, ఎలా దాని చేత ప్రభావితం కావాలి అన్నదానికన్నా, క్రిస్మస్ అలంకరణలైన ట్రీ, స్టార్, క్రిస్మస్ ఖర్చులు, ఆడంబరాలు, వేడుకలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నామేమో అనిపిస్తోంది.
ద్రవ్యోల్బణం, మతపరమైన ఉగ్రవాదం, దోపిడీయే ఇతివృత్తంగా విస్తరిస్తున్న వాణిజ్య సంస్కృతి, పలచబడుతున్న మానవ సంబంధాలు, అడుగంటుతున్న మానవీయ విలువలు నేటి సమాజానికి పెను సవాళ్లుగా మారిన నేపధ్యంలో, క్రిస్మస్ ప్రేమసందేశాన్ని మళ్లీ మళ్లీ మరింతగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
రోమా సామాజ్య్రమంతా విస్తరించిన క్రీస్తుప్రేమ సందేశం చివరికి కాన్స్టాంటిన్, థియోడాసియస్ వంటి రోమా చక్రవర్తులనే క్రైస్తవులుగా మార్చింది. వారి పాలన కూడా క్రీస్తు ప్రేమసందేశంతో, దాని పరిమళంతో ప్రభావితమై సంస్కరించబడింది. క్షమాపణ, పరస్పర ప్రేమ ప్రధాన ఇతివృత్తాలుగా సాగే యేసు క్రీస్తు బోధలు, సందేశాలు కరడుకట్టిన నేరస్తులు, అత్యంత క్రూరమైన పాలకులు, ప్రధానులను సైతం ఎంతో సాత్వికులుగా మార్చేశాయన్నది చరిత్ర చెప్పే సత్యం.
కాబట్టి క్రిస్మస్ను మాత్రమే గుర్తుంచు కుని, క్రిస్మస్ వెనుక ఉన్న కారణాన్ని మర్చిపోకండి. క్రీస్తు జన్మ దినాన వేడుక చేసుకుంటూ, ఆ జన్మ ఎత్తి ఆయన ఇచ్చిన ప్రేమ సందేశాన్ని వదిలి వేయకండి. క్యారల్స్, కేక్స్, అలంకరణలు, బంధువుల హడావుడి, కుటుంబ కలయికలు, క్రిస్మస్ సంబరాలు, బహుమతులు ఇచ్చి పుచ్చు కోవడాలు, వేలల్లో ఖర్చులు... ఇవన్నీ క్రిస్మస్ పండుగలో భాగం అనుకున్నా ఫర్వాలేదు. కానీ వాటిలో తలమునకలై యేసుక్రీస్తు ప్రేమ సందేశాన్ని, క్రిస్మస్ ముఖ్యోద్దేశ్యాన్ని మర్చిపోవద్దని ప్రార్థన!
- రెవ టి.ఎ. ప్రభుకిరణ్