Roofs of houses
-
Green Roof : మండుటెండల్లో రేకుల ఇల్లు కూడా చల్లచల్లగా..!
వేసవిలో మండే ఎండలు, ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఎగువ మధ్యతరగతి, ధనికులైతే ఇళ్లలో ఏసీలు పెట్టుకొని సేదతీరుతుంటారు... మరి నగరాల్లోని బస్తీలు, మురికివాడల్లో రేకుల ఇళ్లలో నివసించే పేదల పరిస్థితి ఏమిటి? పైకప్పుల నుంచి లోపలికి వచ్చే వేడికి తాళలేక, నిద్ర పట్టక వారు విలవిల్లాడా ల్సిందేనా? ఈ ప్రశ్నకు వినూత్న ప్రయోగాలు చవకైన ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తెస్తున్నాయి. భూతాపం ఏటేటా పెరిగిపోతున్న ఈ కాలంలో పేదల ఇళ్లను చల్లబరిచే పనిని విస్తృతంగా వ్యాప్తిలోకి తేవడానికి జూన్ 6న ‘వరల్డ్ గ్రీన్ రూఫ్ డే’ని జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం. (బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగరంలోని ఓ మురికివాడ (ఫావెల్)లో లూయిస్ కాసియానో తన అస్బెస్టాస్ రేకుల ఇంటిపై స్వయంగా ఏర్పాటు చేసుకున్న గ్రీన్ రూఫ్ (ఏరియల్ వ్యూ)) జూన్ 6 వరల్డ్ గ్రీన్ రూఫ్ డే పై ఫొటోలో తన ఆకుపచ్చని ఇంటి పైకప్పుపై కూర్చున్న వ్యక్తి పేరు లూయిస్ కాసియానో (53). బ్రెజిల్‌లోని రియో డి జెనీరో మహానగరంలో పార్క్యు అరర అనే మురికివాడలో ఆస్బెస్టాస్ సిమెంటు రేకుల ఇంట్లో 85 ఏళ్ల తల్లితో కలసి నివాసం ఉంటున్నాడు. వేసవిలో అక్కడ పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్షియస్ దాటిపోతూ ఉంటుంది. ‘ఇటుకలు పగలు వేడిని పీల్చుకొని రాత్రుళ్లు వదులుతూ ఉంటాయి. తెల్లవారుజామున 3 గంటలయ్యే వరకు ఇల్లు చల్లబడేది కాదు. చెమటలు ఆగేవి కాదు. నిద్రపట్టేది కాదు. (మురికివాడలో ఇరుకైన రేకుల ఇళ్ల మధ్య 50 డిగ్రీల సెల్షియస్ ఎండలోనూ మొక్కలతో పచ్చగా లూయిస్ కాసియానో ఇల్లు. పైపు డ్రిప్ ద్వారా ఈ మొక్కలకు తగుమాత్రంగా నీరు ఇస్తూ లూయిస్ పరిరక్షించుకుంటున్నారు.) భరించలేనంత వేడిగా ఉండేది..’అని పదేళ్ల క్రితం పరిస్థితిని కాసియానో గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆయన స్వయంగా తన ఇంటిపై గ్రీన్ రూఫ్ ఏర్పాటు చేసుకోవటంతో పరిస్థితి సానుకూలంగా మారిపోయింది. 2012లో రేకుల ఏటవాలు పైకప్పు మీద మొక్కల్ని పెంచడం మొదలుపెట్టాక ఇల్లు చల్లబడింది. ‘ఇరుగు పొరుగు ఇళ్లకన్నా మా ఇల్లు 15 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లగా ఉంటోంది. రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా కొన్ని గంటలు లేకపోయినా ఇంట్లో ఉండగలుగుతున్నాం’అని కాసియానో చెప్పారు. (లూయిస్ కాసియానో రేకుల ఇంటి పైకప్పుపై మొక్కల్ని పెంచుతున్నది ఇలా) రియో డి జెనీరో యూనివర్సిటీలో గ్రీన్రూఫ్స్పై పరిశోధన చేస్తున్న బ్రూనో రెసెండో సహకారంతో కాసియానో తన ఇంటిపై ప్లాస్టిక్ కూల్‌డ్రింక్ సీసాలను రీసైకిల్ చేసి తీసిన తేలికపాటి పాలిస్టర్ నాన్‌ఓవెన్ జియోటెక్స్‌టైల్ పరదాను పరచి, మట్టి పోసి తీవ్ర ఎండలను సైతం తట్టుకొనే మొక్కలను పెంచుతున్నారు. గ్రీన్‌రూఫ్ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మరీ ఆయన ప్రచారం చేస్తున్నారు. గ్రీన్‌రూఫ్‌లు.. కొన్ని ప్రయోగాలు ముంబై, బెంగళూరులలో సీబ్యాలెన్స్, హసిరుదల వంటి స్వచ్ఛంద సంస్థలు ఇళ్ల పైకప్పులపై వినూత్న ప్రయోగాలు చేస్తున్నాయి. బెంగళూరులోని జ్యోతిపుర మురికివాడలో రేకుల ఇంటి పైకప్పు మీద నీలిరంగు టార్పాలిన్‌పై నీరు నింపిన ప్లాస్టిక్ సీసాలను సీబ్యాలెన్స్ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సీసాల్లోని నీరు ఉష్ణోగ్రతను గ్రహించడం వల్ల ఆ మేరకు ఇల్లు తక్కువగా వేడెక్కుతుందని ఆ సంస్థ చెబుతోంది. రేకుల ఇంటిపై నీలిరంగు ప్యానెళ్లను అమర్చడం ద్వారా కూడా వేడిని తగ్గించవచ్చు. రేకుల ఇంటిపై తెల్ల టి ‘ఎకోబోర్డ్ పేనల్స్’ను పరచి అధిక ఉష్ణోగ్రత నుంచి కొంత మేరకు రక్షణ పొందొచ్చు. రేకుల ఇంటిపై అడుగు ఎత్తున ఇనుప ఫ్రేమ్‌ను ఏర్పాటు చేసి.. దానిపై ఎకోబోర్డ్ ప్యానళ్లను అమర్చటం వల్ల అధిక ఉష్ణోగ్రతను ఎదుర్కొనే ప్రయత్నం చేయొచ్చు. ఈ ఉపాయం సత్ఫలితాలిస్తున్నట్లు సీబ్యాలెన్స్ సంస్థ చెబుతోంది. (బెంగళూరులోని జ్యోతిపుర మురికివాడలో రేకుల ఇంటిపై ఎకోబోర్డ్ ప్యానల్స్‌ను పరచి అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే ప్రయత్నం) మొండి మొక్కలతో కూల్‌కూల్‌గా.. 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లోనూ ఇళ్ల పైకప్పులను చల్లగా ఉంచే కొన్ని మొండి జాతుల మొక్కలను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు చెందిన స్వతంత్ర పరిశోధనా సంస్థ పుణేలోని అఘార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఆర్ఐ) ఇటీవల గుర్తించింది. పశ్చిమ కనుమల్లో కనుగొన్న 62 రకాల మొండి జాతి మొక్కలు 95% తేమను కోల్పోయినా చనిపోవని, తిరిగి తేమ తగిలినప్పుడు చిగురిస్తాయని తెలిపింది. (బెంగళూరులోని జ్యోతిపుర మురికివాడలో ఓ రేకుల ఇంటిపైన అడుగు ఎత్తున ఇనుప ఫ్రేమ్‌ను ఏర్పాటు చేసి, దానిపై ఎకోబోర్డ్ ప్యానళ్లను అమర్చటం వల్ల అధిక ఉష్ణోగ్రతను ఎదుర్కొనే ప్రయత్నం) నగరాల్లో పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే రేకులు, శ్లాబ్ ఇళ్ల పైకప్పులపై ఈ జాతులను పెంచితే స్వల్ప ఖర్చుతోనే గ్రీన్‌రూఫ్‌లు అందుబాటులోకి వస్తాయి. డ్రిప్ ద్వారా నీటిని తగుమాత్రంగా అందిస్తే ఎంత ఎండైనా ఇవి పచ్చగానే పెరిగే అవకాశం ఉంది. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ -
గాలివాన, వడగళ్ల బీభత్సం
దోమ / కుల్కచర్ల, న్యూస్‌లైన్: అన్నదాత ఆశలను ప్రకృతి అడియాస చేసింది. శుక్రవారం జోరుగాలి, వడగళ్లతో విరుచుకుపడిన వాన దోమ, కుల్కచర్ల మండలాల్లో పంటలను నాశనం చేసింది. తీవ్రమైన గాలికి వడగళ్ల వర్షం తోడవడంతో వేల సంఖ్యలో మామిడి కాయలు రాలిపోయాయి. గాలివాన బీభత్సానికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి పలువురు నిరాశ్రయులయ్యారు. దోమ మండలంలోని పలు గ్రామాల్లో 120 ఎకరాల్లో పెంచుతున్న మామిడి తోటల్లో కాయలు నేలరాలి రైతులకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. ఉదన్‌రావుపల్లి గ్రామంలో వడగళ్ల ధాటికి సుమారు 40ఎకరాల్లో వరి పంట చేతికందకుండా పోయింది. దోమతో పాటు ఎల్లారెడ్డిపల్లి, లింగన్‌పల్లి, దిర్సంపల్లి, బ్రాహ్మణ్‌పల్లి, ఉదన్‌రావ్‌పల్లి, పాలేపల్లి, ఐనాపూర్, మోత్కూర్ తదితర గ్రామాల్లో పలువురి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కన్నీటిపర్యంతమైన రైతులు వడగళ్ల వాన దోమతో పాటు ఉదన్‌రావ్‌పల్లి గ్రామాల్లో వరి పంట సాగు చేస్తున్న రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. సుమారు 40 ఎకరాల్లో ధాన్యం నేల రాలి పాడైపోయింది. ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంట కళ్ల ముందే పాడవడంతో రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. ఒక్క దోమ గ్రామంలోనే రైతు గానుగ నర్సయ్య 16 ఎకరాల్లో సాగు చేసిన వరి పంట పూర్తిగా నాశనమైంది. దోమ సర్పంచ్ రాధాబాయి గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి తెలుసుకున్నారు. బాధిత రైతులకు పరిహారం అందించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కుల్కచర్లలో... మండలంలో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులు, వడగళ్లు ప్రజలతో పాటు రైతులకు నష్టం మిగిల్చాయి. అంతారం, కుల్కచర్ల, బండ వెల్కిచర్ల, పుట్టపహడ్, ఘణపూర్ గ్రామాల్లో సుమారు 500 ఎకరాల్లో వరి పంట దెబ్బతినగా, తోటల్లో పెద్దసంఖ్యలో మామిడికాయలు నేలరాలాయి. జోరుగాలికి కుల్కచర్ల, బంగరంపల్లి గ్రామాల్లో 20 ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. మండల కేంద్రంలో ఈడ్గి పుల్లయ్యగౌడ్ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.