హీరో తండ్రిపై పోలీసు కేసు
ముంబై: 'క్రిష్ 3' సినిమా కథను తన నవల నుంచి దొంగిలించారని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తండ్రి రాకేశ్ రోషన్ పై నవలా రచయిత రూప్ నారాయణ్ సొంకర్ ఆరోపణలు చేశారు. కాపీ రైట్ చట్టం కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'క్రిష్ 3' సినిమా కథను తాను రాసిన 'సార్దాన్' నవల నుంచి తస్కరించారని ఆరోపించారు. తన నవల కాపీని కూడా పోలీసులకు అందజేశారు.
నారాయణ్ ఫిర్యాదు మేరకు రాకేశ్ రోషన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నవలను 2010లో రాశానని దీని ఆధారంగానే 2013లో 'క్రిష్ 3' సినిమా తీశారని తెలిపారు. నారాయణ్ ఆరోపణలపై స్పందించేందుకు రాకేశ్ రోషన్ నిరాకరించారు. ఈ వ్యవహారం పోలీసుల పరిధిలో ఉన్నందున ఏమీ మాట్లాడబోనని అన్నారు. నారాయణ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టామని, ఆరోపణలు నిజమని తేలితే తదుపరి చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.
2013, నవంబర్ 1న విడుదలైన 'క్రిష్ 3' సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన హృతిక్ రోషన్, కంగనా రౌనత్ మధ్య కూడా న్యాయవివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.