రోహిత్ సూసైడ్ రిపోర్ట్‌ను తగలబెట్టేశారు
సాక్షి, హైదరాబాద్: రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడంటూ జస్టిస్ రూపన్‌వాల కమిషన్ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఆ కాపీలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు దహనం చేశారు.
గురువారం సాయంత్రం కాలేజీ ఆవరణలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న రోహిత్ వేముల విగ్రహాం వద్ద గుమిగూడిన విద్యార్థులు పత్రులను తగలబెట్టి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. కమిటీ నివేదిక అర్థం పర్థం లేనిదని అంబేద్కర్ స్టూడెంట్స్ అసోషియేషన్ నేత దొంత ప్రశాంత్ విమర్శించారు. కేంద్రం కనుసన్నల్లోనే నివేదికను రూపొందించారని, సాక్ష్యాలు తారుమారు అయ్యాయని ఆయన ఆరోపించారు. హక్కుల కోసం దళితులు పోరాటం చేయాల్సిన పరిస్థితిని ప్రభుత్వాలు కల్పించాయని తెలిపారు. ఇక విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ యూనివర్సిటీ ప్రోఫెసర్ కే లక్ష్మీ నారాయణ నిరసనలో పాల్గొన్నారు. ఓ న్యాయమూర్తి కూడా అబద్ధాల నివేదిక ఇచ్చి ఇస్తాడని తాను ఊహించలేదని ఈసందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
రోహిత్ సూసైడ్‌కు సస్పెన్షన్ తోపాటు మరియు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, యూనివర్సిటీ అధికారులే కారణమంటూ విద్యార్థులు ఆరోపించటంతో అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ రూపన్వాల్ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. గత అక్టోబర్ లోనే నివేదికను రూపొందించి కేంద్ర మానవాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సమర్పించింది. అయితే ఈ మధ్యే అధికారికంగా దానిని ప్రకటించారు.