ఆయనతో నైటౌట్.. ప్రియుడితో బ్రేకప్!
లాస్ఏంజిల్స్: ప్రముఖ ఎం టీవీ ప్రజెంటర్ లారా వైట్మోర్- రాక్ సింగర్ రోరీ విలయమ్స్ ప్రణయబంధానికి బీటలు పడ్డాయి. బాఫ్టా అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా లియోనార్డో డికాప్రియోతో లారా నైటౌట్ చేయడం.. ఈ ప్రేమికుల మధ్య చిచ్చు రేపింది. రోరీ నుంచి లారా విడిపోయింది.
గత నెలలో లండన్‌లోని రాయల్ ఓపెరా హైజ్‌లో జరిగిన బాఫ్టా వేడుకల సందర్భంగా 'రెవెనంట్' స్టార్ లియో, లారా సన్నిహితంగా కనిపించారు. చెట్టాపట్టాలేసుకొని ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సాన్నిహిత్యమే లారా-రోరీ బ్రేకప్ కు దారితీసింది. లారా (30) గత ఏడాది వేసవి నుంచే తనకంటే ఏడాది చిన్నవాడైన రోరీతో డేటింగ్ చేస్తోంది. వీళ్ల ప్రణయబంధం పెళ్లిపీటల వరకు వెళుతుందని భావించారు. ఇటీవల బోయ్ఫ్రెండ్ను ఈ అమ్మడు తన కుటుంబసభ్యులకు కూడా పరిచయం చేసింది. ఈ క్రమంలో బాఫ్టా వేడుకల్లో లియో-లారా కలిసి తిరుగడమే వీరి బంధానికి బ్రేక్ వేసింది. అయితే తాను లియోతో స్నేహంగా మాత్రమే గడిపానని, అంతకుమించి ఎలాంటిది జరుగలేదని లారా చెప్తోంది. లారాతో తాను విడిపోలేదని, ప్రస్తుతం తన మ్యూజిక్ కెరీర్‌పైనే దృష్టిపెట్టానని రాక్ సింగర్ రోరీ తెలిపాడు. లియో ఎపిసోడ్ వీరి బ్రేకప్‌కు దారితీసిందని సన్నిహితులు చెప్తున్నారు.