డీఆర్సీ ఊసేది?
మూడునెలలకోసారి జరగాల్సిన జిల్లా సమీక్షామండలి సమావేశం (డీఆర్సీ) ఏడాదికాలంగా జాడలేకుండాపోయింది. పొరుగు జిల్లావాసి పొన్నాల లక్ష్మయ్య జిల్లా ఇన్చార్జిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో గతేడాది అక్టోబర్‌లో డీఆర్సీ నిర్వహించారు. మళ్లీ అక్టోబర్ వస్తున్నా.. మరో సమావేశం ఊసెత్తడం లేదు.
గత నెల 17న డీఆర్సీ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా.. పొన్నాల లక్ష్మయ్య సమయం ఇవ్వకపోవడం వల్ల చివరి నిమిషంలో వాయిదాపడింది. నెల దాటినా తిరిగి తేదీ ఖరారు చేయకపోవడం ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్న విమర్శలున్నాయి. శుక్రవారం జిల్లా పర్యటనకు వస్తున్న పొన్నాల డీఆర్సీని మరిచి.. తూతూమంత్రంగా అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది.
- సాక్షి, కరీంనగర్
సాక్షి, కరీంనగర్ : జిల్లా అభివృద్ధికి సంబంధించి దిశానిర్దేశం చేయాల్సిన జిల్లా సమీక్ష మండలి మూడు నెలలకోసారి జరగాల్సి ఉంటుంది. కేవలం మంత్రులకు తీరిక లేనందువల్ల కీలకమైన ఈ సమావేశాలు నెలల తరబడి జరగకపోవడం ప్రగతిపై ప్రభావం చూపుతోంది. తక్షణ సమస్యలను చర్చించడం, ప్రభుత్వ పథకాల అమలు, పాలనా యంత్రాంగం వ్యవహార శైలిని ఎప్పటికప్పుడు సమీక్షించడం, అధికారులకు కార్యాచరణ నిర్దేశించడం డీఆర్సీ ఉద్దేశం. జిల్లాకు సంబంధించి సమగ్రమైన చర్చ జరిగే ఏకైక వేదిక అయిన డీఆర్సీ పట్ల అధికార పార్టీ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది.
రోశయ్య ముఖ్యమంత్రి అయిన తరువాత డీఆర్సీ ప్రహసనంగా మారింది. రోశయ్య హయాంలో ఇన్చార్జి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఒక సమావేశం జరిగింది. తర్వాత ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ముఖేష్‌గౌడ్ అసలు మొహం కూడా చూపలేదు. మూడేళ్లక్రితం మల్హర్ మండలం వల్లెంకుంటలో జరిగిన రచ్చబండ సభలో సీఎం కిరణ్‌తోపాటు ఆయన పాల్గొన్నారు. ముఖేష్ తర్వాత జిల్లా ఇన్చార్జిగా నియమితులైన పొన్నాల లక్ష్మయ్య గతేడాది అక్టోబర్ నెలాఖరులో డీఆర్సీ సమావేశాన్ని నిర్వహించారు. మళ్లీ అక్టోబర్ వస్తున్నా ఇంతవరకూ మరో సమావేశం జాడలేదు. ఇలా నెలల తరబడి డీఆర్సీ జరగకపోవడం వల్ల విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై మూడు నెలలకోసారి విధిగా జిల్లాకు వస్తానని హామీ ఇచ్చిన పొన్నాల కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. డీఆర్సీ జరగక ఏడాది దగ్గర పడుతున్నా ఇన్చార్జి మంత్రి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నా మంత్రులు పట్టించుకోవడం వారి చిత్తశుద్ధిని అనుమానించాల్సి వస్తోంది.
భారీ వర్షాల వల్ల జరిగిన నష్టం, దెబ్బతిన్న పంటలు, ఎరువులు, విత్తనాలు, సీజనల్ వ్యాధులు, విద్యుత్ తదితర సమస్యలపై తక్షణం దృష్టి పెట్టాల్సి ఉంది. అధికార పార్టీ నేతలతోపాటు విపక్షసభ్యులు కూడా ఈ విషయంలో శ్రద్ధ చూపడం లేదన్న ఆరోపణలున్నాయి. భారీ వర్షాలతో జిల్లా ప్రజానీకం అతలాకుతలమయిన సమయంలో కూడా ప్రతిపక్షసభ్యులు అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదు. నేతలు ఎవరి వ్యాపకాల్లో వారు మునిగిపోవడంతో పాలనా వ్యవహారాలు పడకేస్తున్నాయి. ప్రగతి, సంక్షేమ కార్యక్రమాలు సజావుగా జరిగేలా మార్గదర్శనం చేసేందుకు ఇప్పటికైనా డీఆర్సీ సమావేశం నిర్వహించాల్సిన అవసరముంది.
నేడు జిల్లాకు పొన్నాల
కలెక్టరేట్ : సుదీర్ఘకాలం తర్వాత జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఉదయం 10.30కు కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కోరుట్లలో వెటర్నరీ కళాశాల వసతిగృహాన్ని ప్రారంభిస్తారు.
మల్లాపూర్‌లో మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ వెళ్తారు. మొదటగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం మంత్రి పర్యటన కోరుట్ల, మల్లాపూర్ మండలాలకే పరిమితమైంది. కానీ మారిన షెడ్యూల్ ప్రకారం.. కలెక్టరేట్లో అధికారులతో రెండు గంటలపాటు సమీక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. చాలాకాలం తర్వాత మొహం చూపిస్తున్న పొన్నాలకు ఈ సమావేశం ఎలాంటి సవాళ్లు విసురుతుందనేది చూడాల్సిందే.