వైఎస్‌పై నిందలేయడం సరికాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమతం ఏమిటన్నది ఆయన 2009 ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలకు ముందు రోశయ్య కమిటీకి ఇచ్చిన విధివిధానాలు, విచారణాంశాలను పరిశీలిస్తే తెలుస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు వైఎస్సార్ బీజం వేశారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, కాంగ్రెస్, టీడీపీ నేతలు నిందలేయడం సరికాదన్నారు. వైఎస్సార్ మనసులో ఏముండేది అన్న విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసునని చెప్పారు. కొణతాల సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఒక సీఎల్పీ నేతగా వైఎస్సార్ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల మనోభావాల్ని గౌరవిస్తూ వారిచ్చిన వినతిపత్రాన్ని కాంగ్రెస్ అధినాయకత్వానికి పంపారని తెలిపారు. దానిపై చర్చించిన సీడబ్ల్యూసీ... దేశం లో ఇంకా గూర్ఖాలాండ్, బోడోలాండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక రాష్ట్రాలు కావాలన్న డిమాండ్ ఉందనే విషయాన్ని ప్రస్తావిస్తూ... రెండో ఎస్సార్సీని వేయాల్సిందిగా హోం శాఖకు సూచించిందని చెప్పారు.
అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండో ఎస్సార్సీ విషయాన్ని గాలికొదిలేసి విభజనకు వైఎస్ బీజం వేశారని దుష్ర్పచారం చేస్తోందని విమర్శించారు. తెలంగాణకు వ్యతిరేకం కాదని, అయితే అన్ని ప్రాంతాలకు చెందిన భాగస్వాములతో (స్టేక్ హోల్డర్స్‌ను) చర్చించి, వారిని ఒప్పించి న్యాయమైన పరిష్కారం చేయాలని ఆ రోజు అసెంబ్లీలో వైఎస్ ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఈ ప్రకటనకు అనుగుణంగా 2009 ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలకు ముందు రోశయ్య అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారని, 2009 మార్చి 4వ తేదీన విచారణాంశాలను వెల్లడించారని వివరించారు. విభజన విషయంలో వైఎస్ వైఖరి ఏమిటనేది రోశయ్య కమిటీకి ఇచ్చిన విచారణాంశాలను చూస్తే తెలుస్తుందన్నారు. తాను కూడా రోశయ్య కమిటీలో సభ్యుడిని కనుక విచారణాంశాలు ఏమిటో తనకు తెలుసునని చెప్పారు. కాంగ్రెస్ నిజంగా వైఎస్‌ను గౌరవించి ఉంటే రెండో ఎస్సార్సీ వేయడం లేదా రోశయ్య కమిటీలోకి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం చేసేదని తెలిపారు. వాస్తవం ఇలా ఉండగా వైఎస్ వల్లనే రాష్ట్రం ఈరోజు తగులబడి పోతోందని టీడీపీ విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు.
ఒకటికి నాలుగుసార్లు కోరింది చంద్రబాబే
దివంగత వైఎస్సార్‌పై విమర్శలు చేసే ముందు టీడీపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కొణతాల హితవు చెప్పారు. తెలంగాణ ఏర్పాటు చేయాల్సిందిగా టీడీపీ 2008లో ప్రణబ్‌ముఖర్జీకి లేఖ ఇవ్వడంతోపాటు, రాష్ట్రాన్ని విభజించాల్సిందిగా ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నాలుగుసార్లు కోరారని గుర్తుచేశారు. బాబు చెప్పినందుకే రాష్ట్రాన్ని విభజించారని విమర్శించారు. విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన వెంటనే బాబు వత్తాసు పలుకుతూ నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు ఇస్తే సింగపూర్ తరహా రాజధానిని నిర్మిస్తానని చెప్పిన విషయం మరిచారా? అని ఆయన టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణపై బాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏకపక్షంగా, నిరంకుశంగా జరిగిన విభజనను నిరసిస్తూ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవులకు రాజీనామా చేసిన విధంగానే చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని కోరారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు రాష్ట్రం అధోగతి పాలవుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడమే కాక ఎదుటివారిపై బురద జల్లే యత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. విభజనపై చంద్రబాబు మౌనంగా కూర్చోవడం, వాళ్ల ఎంపీలు పార్లమెంటులో గందరగోళం సృష్టించడం ఏమిటని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రం కోసం అందరమూ కలిసి పోరాడాలి కానీ ఇలా ఒకరిపై నిందలేయడం సబబు కాదన్నారు. ఎన్నికలు జరిగితే తెలంగాణలో టీఆర్ఎస్కే అనుకూల పరిస్థితి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.