కోర్టులో పోలీసు కాల్పులు.. న్యాయవాది మృతి
అలహాబాద్: అలహాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో పోలీసులు.. న్యాయవాదుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ లాయర్ మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కోర్టులో ఉద్రిక్తతను చల్లార్చేందుకు ఓ ఎస్ఐ జరిపిన కాల్పుల్లో ఓ లాయర్ మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. లాయర్లు వెంటనే స్పందించి... క్షతగాత్రుడ్ని నగరంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
అయితే కాల్పుల ఘటనతో కోర్టు ఆవరణలో ఉన్న లాయర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. లాయర్లు పోలీసులతో ఘర్షణకు దిగి.. కోర్టు ఆవరణలోని వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కూతవేటు దూరంలో అలహాబాద్ హైకోర్టులోని న్యాయవాదులకు సమాచారం అందడంతో అక్కడి న్యాయవాదులు రెచ్చిపోయారు. అలహాబాద్ - కాన్పూర్ జాతీయరహదారిపై వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం... కోర్టు ఆవరణలో ఘర్షణకు దిగిన లాయర్లను అదుపులోకి తీసుకొచ్చేందుకే ఎస్ఐ కాల్పులు జరిపారని చెప్పారు. ఆ కాల్పులు జరిపింది ఎవరో ఇంకా నిర్థరించలేదని పోలీసు శాఖ ప్రతినిధి మృత్యుంజయ మిశ్రా తెలిపారు. మృతి చెందిన న్యాయవాది రోషన్ అహ్మద్‌గా గుర్తించారు. గాయపడిన న్యాయవాది ఫిరోజ్ నబీ అని పోలీసులు తెలిపారు. ఘటన స్థలం వద్దకు పోలీసులు ఉన్నతాధికారులతో పాటు న్యాయమూర్తులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.