కావలిలో రష్యా అణు విద్యుత్ కేంద్రం?
రష్యా అధ్యక్షుడి పర్యటనలో ఒప్పందం
అమరావతి: రాష్ట్రంలో మరో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అమెరికా కంపెనీలు ప్రయత్నిస్తుండగా, తాజాగా రష్యా కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం విజయంతో రాష్ట్రంలో కాలు మోపడానికి రష్యా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
రష్యాకు చెందిన రోస్టమ్ కంపెనీ నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ఒక్కొక్కటి 1,000 మెగా వాట్ల సామర్థ్యంతో ఆరు భారీ అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కావాల్సిన భూమిని ఇప్పటికే గుర్తించినప్పటికీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో ఈ విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. వచ్చేనెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు వచ్చినపుడు ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రష్యా ఉప ప్రధాని దిమిర్తి రొగొజిన్ ముందస్తు కసరత్తు పూర్తి చేశారు.
సుష్మతో రష్యా చర్చలు: నెల రోజుల్లోనే రెండు సార్లు ఆయన మన దేశ పర్యటనకు రావడం, విదేశీ వ్యవహారామంత్రి సుష్మాస్వరాజ్తో చర్చలు జరపడం ఈ విషయాలను మరింత బలపరుస్తున్నాయి. రెండు రోజుల క్రితం సుష్మాస్వరాజ్తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో ఏర్పాటు చేసే అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించి ఒప్పంద పత్రాలు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇరు దేశాల భాగస్వామ్యంతో అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని, 2020 నాటికి దేశంలో 10 అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమని రొగొజిన్ ఢిల్లీలో ప్రకటించడం గమనార్హం. ప్రధాని మోదీ రష్యా పర్యటనలో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల జీ-20 సమావేశంలో కూడా ఇరువురి మధ్య ఈ అం శం చర్చకు వచ్చింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు రష్యా పర్యటనలో కూడా ఈ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు గురించి చర్చలు జరిపారు.