శ్రీరామమూర్తి, రామలింగారెడ్డికి అరుదైన గౌరవం
నంద్యాల : రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పబ్లిక్ ఇమేజ్ కో ఆర్డినేటర్‌గా తనను, సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేయడానికి ఇన్స్టిట్యూట్ జాయింట్ సెక్రటరీగా గవర్నర్ కందుకూరి శ్రీరామమూర్తిని నియమించినట్లు క్లబ్ మాజీ గవర్నర్ కల్లూరి రామలింగారెడ్డి తెలిపారు. ఆయన స్థానిక రోటరీ భవన్లో గురువారం విలేకరులతో మాట్లాడారు. 2017–2018కు రోటరీ క్లబ్ ఇంటర్నేషల్ డైరెక్టర్‌గా ఎంపికైన భాస్కర్ చొక్కలింగం తమను గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించారని చెప్పారు. రోటరీలోని 3160, 3020 పరిధిలో ఉన్న జిల్లాలకు తాను కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారని చెప్పారు.
ఫిబ్రవరి 4, 5 తేదీల్లో సమావేశం..
ఫిబ్రవరి 4, 5 తేదీల్లో రోటరీ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని కందుకూరి శ్రీరామమూర్తి తెలిపారు. 66 క్లబ్‌ల నుంచి వెయ్యిమందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని, పంజాబ్‌కు చెందిన గుర్బత్సింగ్ సమావేశాన్ని పర్యవేక్షిస్తారని చెప్పారు. తనకు రోటరీ ఇన్స్టిట్యూట్ జాయింట్ సెక్రటరీగా, డిస్ట్రిక్ట్ ప్రమోషన్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారని చెప్పారు. హైస్కూల్ విద్యార్థులకు బల్లలు, మహిళలకు కుట్టు మిషన్లను ఇస్తామని తెలిపారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి సుబ్రమణ్యం, సీనియర్ రొటేరియన్లు నెరవాటి సత్యనారాయణ, గోళ్ల జయకృష్ణ పాల్గొన్నారు.