‘సౌమ్య’ విజయం అభినందనీయం
నంద్యాల: ఇంటర్ విద్యార్థిని కలుబురిగి సౌమ్య ఫెన్సింగ్‌లో సాధించిన విజయాలు నంద్యాలకే గర్వకారణమని రోటరీ గవర్నర్ కందుకూరి శ్రీరామమూర్తి ప్రశంసించారు. రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ టోర్నీలో రెండు బంగారు పతకాలను సాధించిన సౌమ్యను ఆమె తల్లిదండ్రులు మహేశ్వరరావు, మాధురిలను ఆదివారం రోటరీ క్లబ్ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా శ్రీరామమూర్తి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పారు. సౌమ్య..జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి నంద్యాల ప్రతిష్టను పెంచాలని కోరారు. కార్యక్రమంలో రోటరీ మాజీ గవర్నర్ కల్లూరి రామలింగారెడ్డి, అధ్యక్షుడు రమేష్, సీనియర్ రొటేరియన్ నిచ్చెనమెట్ల సుబ్బరామయ్య, సభ్యులు పాల్గొన్నారు.