దూర విద్యే..!
- కోర్సుల నిర్వహణ ప్రశ్నార్థకం ...
- కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వని యూజీసీ
- ఆన్లైన్ కోర్సులదీ ఇదే పరిస్థితి
- వర్సిటీ అత్యుత్సాహం వల్లే ఈ దుస్థితి
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం నిర్వహించే కొన్ని కోర్సులకు ఈ విడత ప్రవేశాలు ప్రశ్నార్థకంగా మారాయి. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీసీ అనుమతి లభించక నోటిఫికేషన్ జారీలో జాప్యం జరిగింది. మరో వైపు దూరవిద్యా కేంద్రం నిర్వహించే కోర్సులకు అనుమతి ఇస్తూ యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో సెక్షన్ ఆఫీసర్ భరద్వాజ్ మూడు రోజుల క్రితం యూనివర్సిటీకి లేఖ పంపారు. అయితే 2010 వరకు ప్రవేశ పెట్టిన కోర్సులకు మాత్రమే ఈ ఏడాది నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చని తరువాత ప్రవేశ పెట్టిన కోర్సులకు యూజీసీ అనుమతితోనే నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
2010 వరకు పీజీ, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ విభాగాల్లో మొత్తం 65 కోర్సులను నిర్వహించింది. ఆ తరువాత కాలంలో ఉపాధి అనుబంధంగా ఉన్న 15కు పైగా కొత్త కోర్సులను ప్రవేశ పెట్టింది. వీటికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకుందా అనే విషయం స్పష్టం కాలేదు. దీంతో యూజీసీ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో 2010 వరకు ఉన్న కోర్సులకే అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆన్లైన్ కోర్సుల నిర్వహణకు లభించని అనుమతి ...
ఏఎన్‌యూ ఇటీవల వివిధ ఆన్లైన్ కోర్సులను నిర్వహిస్తోంది. వీటి నిర్వహణకు లక్షల రూపాయలను వెచ్చించింది. ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. అయితే నిర్వహణకు సంబంధించి విధివిధానాలు రూపొందించే వరకు ఈ కోర్సులను నిర్వహించవద్దని యూజీసీ నిబంధనలు విధించింది. దీంతో ఏఎన్‌యూ అట్టహాసంగా ప్రారంభించిన ఆన్లైన్ కోర్సుల భవిష్యత్‌పై నీలినీడలు అలుముకున్నాయి.
దీంతో పాటు దూరవిద్యాకేంద్రం ద్వారా నిర్వహించనున్న ఎంఈడీ తదితర కోర్సులదీ అదే పరిస్థితి. యూనివర్సిటీ హెడ్‌క్వార్టర్‌లో ఫుల్‌టైం ఫ్యాకల్టీ లేకుండా కోర్సులు నిర్వహించవద్దని కూడా యూజీసీ స్పష్టం చేసింది. దీంతో ఎడ్యుకేషన్, ఎంఏ హిందీ తదితర కోర్సులను నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది.
యూనివర్సిటీ అత్యుత్సాహం వల్లే ఈ పరిస్థితి ...
అన్ని అనుమతులు తీసుకొని కొత్త కోర్సులు ప్రారంభించాల్సి ఉండగా హడావుడిగా దూరవిద్య కోర్సులను ప్రారంభించటం వల్లనే ఈ దుస్థితి నెలకొందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా 2010 తరువాత ప్రవేశ పెట్టిన కోర్సులు చదివిన వారి పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పాటు యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా యూజీసీ అధికారు లు లేఖలో స్పష్టం చేయటం విశేషం. ఏఎన్‌యూ నుంచి యూజీసీకి అఫిడవిట్ తదితర పత్రాలను సకాలంలో సమర్పించలేదని ఇది సరికాదని బ్యూరో సెక్షన్ ఆఫీసర్ భరద్వాజ్ పేర్కొన్నారు. ప్రత్యేక నిబంధనలు పట్టించుకోకుండా కొందరు అధికారులు చేపట్టిన చర్యల వల్లే ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై దూరవిద్యాకేంద్రం డెరైక్టర్ ఆచార్య ఎంవీ రాంకుమార్త్న్రంను వివరణ కోరగా అన్ని కోర్సులకు యూజీసీ అనుమతి ఉందని అన్ని కోర్సులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు.