సీఎంవోలో కదలని ఫైళ్లు
భారీగా పేరుకుపోతున్న వైనం
విధానపరమైన వాటితోపాటు, రొటీన్ ఫైళ్లకూ మోక్షం లేదు
రోజువారీ సమీక్షలతో సీఎం బిజీబిజీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫైళ్లు ముందుకు కదలడం లేదు. వేయికిపైగా ఫైళ్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సంతకం కోసం ఎదురు చూస్తున్నాయి. ముఖ్యమంత్రి వద్ద సాధారణ పరిపాలనతోపాటు పురపాలక శాఖ, పలు సంక్షేమ శాఖలు ఉన్నాయి. సీఎం ఆయా శాఖలకు సంబంధించిన ఫైళ్లను చూడకుండా సమీక్షా సమావేశాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఐదు వందల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి కోసం పలువురు టెండర్లు దాఖలు చేయగా.. సీఎస్ రాజీవ్‌శర్మ అధ్యక్షతన ఉన్నతస్థాయి కార్యదర్శుల కమిటీ ధర నిర్ణయించింది. ఈ ఫైలు పెండింగ్‌లో ఉందని సమాచారం. భారీ స్పంద న వచ్చిన నేపథ్యంలో 500 మెగావాట్లు కాకుం డా వెయ్యి మెగావాట్లు తీసుకోవడానికి ముఖ్యమంత్రి అనుమతి కోరుతూ డిస్కమ్‌లు మరో ఫైలు పంపించినా... దానికీ మోక్షం లభించలేదు.
ఇక వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్ వినియోగించుకునేందుకు ఉద్దేశించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేయాల్సిన పథకం టెండర్లలో అధిక ధర వచ్చిందంటూ ఆ టెండర్లను రద్దు చేశారు. ఆ తరువాత తిరిగి ఏమి చేయాలన్న దానిపై సీఎం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఆర్టీసీ ఉద్యోగుల తెలంగాణ ఇంక్రిమెంట్ ఫైలుపై ఆయన సంతకం చేయలేదని సమాచారం.
బహుళ అంతస్తుల నిర్మాణానికి అవసరమైన చోట సడలింపులు ఇచ్చే ఫైళ్లపై నిర్ణయం తీసుకోవడం లేదని తెలిసింది. యాదగిరిగుట్ట పట్టణాభివృద్ధి సంస్థ ఫైలు, ఆంధ్రా నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అఖిల భారత సర్వీసు అధికారుల పోస్టింగ్‌ల ఫైలు కూడా పెండిం గ్లో ఉంది. ‘ఫాస్ట్’ మార్గదర్శకాల ఫైలు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బయటకు రాలేదు. సీఎం కార్యదర్శులు కూడా ఫైళ్లను క్లియర్ చేయించడంలో చొరవ తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.