హత్య కేసులో మైనర్ సహా పలువురి అరెస్ట్
బెంగళూరు: పాతకక్షలతో కొందరు వ్యక్తులు ప్లాన్ చేసి ఓ రౌడీషీటర్‌ను హత్యచేసిన కేసులో ఓ బాలుడితో సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బెంగళూరులో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. రౌడీషీటర్ సునీల్ బంధువు యతిరాజ్‌తో నాగరాజుకు ఓ భవనం నిర్మాణం విషయంలో గొడవలు తలెత్తాయి. దీంతో గతేడాది మార్చి12న రౌడీ షీటర్ సునీల్ తన గ్యాంగ్‌తో కలిసి నాగరాజు అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. నాగరాజు చనిపోయాడని భావించిన సునీల్ గ్యాంగ్ అక్కడినుంచి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడ్డ నాగరాజును ప్రాథమిక చికిత్స అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో బంధువుల ఇంటికి తరలించి చికిత్స అందించారు. బసవేశ్వరనగర్ జైలుకు వెళ్లిన సునీల్ బెయిల్‌పై విడుదలయ్యాడు.
సునీల్‌పై కక్ష పెంచుకున్న నాగరాజు గ్యాంగ్ అతడిని ఎలాగైనా హత్య చేయాలని ప్లాన్ చేశారు. గత బుధవారం ఉదయం సునీల్ ఇంటికి వెళ్లి అతడిని బయటకు ఈడ్చుకొచ్చారు. అందరూ చూస్తుండగానే పదునైన ఆయుధాలతో సునీల్‌పై దాడిచేసి హత్యచేసింది నాగరాజు గ్యాంగ్. ఈ కేసులో బసవేశ్వరనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎనిమిది మంది నిందితులను, ఓ మైనర్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులలో నాగరాజు(26), నందీషా(19), రమేషా(25), కుమార్(24), వినయ్(21), గురురాజ్(24), ఖాదర్(28), ఉమర్ ఖాన్(23) సహా ఓ మైనర్ బాలుడు ఉన్నట్లు పోలీసులు వివరించారు.