అశ్లీల దుస్తులతో లైవ్‌బ్యాండ్
బెంగళూరు : రెండు బార్ అండ్ రెస్టారెంట్లపై దాడులు నిర్వహించిన సీసీబీ పోలీసులు 128 మందిని అరెస్టు చేశారు. 64 మంది యువతులకు విముక్తి కలిగించారు. వారు శుక్రవారం తెలిపిన సమాచారం మేరకు.. ఉద్యోగాల పేరుతో యువతులను మోసం చేసి బలవంతంగా వారితో బార్ అండ్ రెస్టారెంట్లలో అశ్లీల దుస్తులతో లైవ్‌బ్యాండ్ నిర్వహిస్తున్నారు.
అంతేకాకుండా కస్టమర్లను లైంగికంగా రెచ్చగొట్టాలని ఆ యువతులను వేధించేవారు. దీనిపై కచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు గురువారం రాత్రి మెజస్టిక్ సమీపం గాంధీనగర్‌లోని రాయల్ క్యాసినో, సంపంగి రామనగర్‌లో సిల్వర్ స్పూన్ బార్ అండ్ రెస్టారెంట్లపై దాడులు చేశారు. ‘రాయల్ క్యాసినో’లో పని చేస్తున్న 11 మందిని, 51 కస్టమర్లను అరెస్ట్ చేశామని, రూ. 25 వేలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అందులోని 36 మంది యువతులకు విముక్తి కల్గించామని తెలిపారు.
అలాగే ‘సిల్వర్ స్పూన్’లో పని చేస్తున్న 27 మందిని, 39 మంది కస్టమర్లను అరెస్ట్ చేశామని, రూ. 43 వేల వేలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అలాగే 28 మంది యువతులను రక్షించామని చెప్పారు. పరారీలో ఉన్న సిల్వర్ స్పూన్ బార్ అండ్ రెస్టారెంట్ యజమాని వెంకటేశ్, యువతులను సరఫరా చేసిన పంజాబ్‌కు చెందిన నేహా, లైవ్‌బ్యాండ్ నిర్వాహకులు లక్ష్మికాంత, దినేష్ తదితరుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.