మూడు ముక్కలాట! - రచన, దర్శకత్వం: కాంగ్రెస్ హైకమాండ్
డబ్ల్యూ. చంద్రకాంత్, సాక్షి-న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధిష్టానం మరో దుష్ట పన్నాగానికి తెరతీస్తోంది. ఒకవైపు తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని, సీమాంధ్రుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని చెబుతూనే మరోవైపు రాయల తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు వెనుకనుండి ఆజ్యం పోసే ప్రయత్నాల్లో ఉంది. రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర మంటలు రేకెత్తించడమే కాంగ్రెస్ కుట్రలోని లక్ష్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో వైరిపక్షాలను నిరోధించేందుకు, తాను లబ్ధి పొందే క్రమంలో.. కాంగ్రెస్ రాష్ట్రాన్ని మూడుముక్కలు చేసేందుకు కూడా వెనుకాడబోదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ఇందుకు తగిన వ్యూహాన్ని రూపొందించి ఆ మేరకు పావుల్ని నడిపిస్తున్నారని చెబుతున్నారు.
అనంతపురానికి చెందిన కాంగ్రెస్ నేతలు తొలుత రాయల తెలంగాణ రాగం అందుకోగా ఇప్పుడు కర్నూలు నేతలు కూడా ఇదే డిమాండ్‌తో గళం విప్పారు. అనంతపురం నేత జేసీ దివాకర్‌రెడ్డి వంటి వారిని ప్రోత్సహించిన రాష్ట్ర ఇన్చార్జి తాజాగా సోమవారం కర్నూలు జిల్లా నేతలను తన ఇంటికి పిలిపించుకున్నారు. సాగునీటి అవసరాలు, డిమాండ్లతో పాటు పొరుగున ఉన్న కృష్ణా బేసిన్ అంశాలను ప్రస్తావిస్తూ.. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలపాలని జేసీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇదే డిమాండ్‌ను భుజానికెత్తుకున్న కర్నూలు నేత, రైల్వేశాఖ సహాయ మంత్రి కె.సూర్యప్రకాశ్‌రెడ్డితో పాటు మరో ఎంపీ, రాష్ట్ర మంత్రి ఒకరు, పలువురు ఎమ్మెల్యేలు దిగ్విజయ్ నివాసానికి వెళ్లారు. సుమారు గంటసేపు ఆయనతో మంతనాలు కొనసాగించారు.
భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కర్నూలును తెలంగాణలో కలపాలనే డిమాండ్‌ను ఆయన ముందుంచారు. అయితే రాయలసీమలో వేర్పాటువాద ఉద్యమ వేడి రగిలించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు వేసిన పథకంలో ఇది భాగమని స్పష్టంగా తెలిసిపోతోంది. వాస్తవానికి తెలంగాణపై నిర్ణయానికి ముందే కాంగ్రెస్ పెద్దలు రాయల తెలంగాణ ప్రతిపాదనకు ఓ రెండు తెలుగు చానెళ్ల ద్వారా ఇన్నాళ్లూ విస్తృత ప్రచారం కల్పించారు. అయితే 10 జిల్లాలతో కూడిన తెలంగాణకు సోనియాగాంధీ మొగ్గు చూపిన నేపథ్యంలో కొంత మౌనం పాటించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తాజాగా మరోసారి పార్టీ అధ్యక్షురాలికి కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు పార్టీవర్గాల సమాచారాన్ని బట్టి అవగతమవుతోంది. రాయల తెలంగాణతో రాజకీయంగా సంఖ్యాపరమైన అసమతుల్యతను పూడ్చవచ్చని సదరు నేతలు సోనియాకు చెబుతున్నట్లు తెలుస్తోంది.
రాయల తెలంగాణ రాష్ట్ర బిల్లుగా తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు కూడా ఇది మార్గం సుగమం చేస్తుందని వారు వివరిస్తున్నారు. వీరి విజ్ఞప్తికి అధిష్టానం ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తుందో తెలియనప్పటికీ 10 జిల్లాలతో కూడిన తెలంగాణకే పరిమితం అవుతామని కాంగ్రెస్ స్పష్టంగా ఎక్కడా చెప్పని విషయం మరవరాదని విశ్లేషకులంటున్నారు. రాయల తెలంగాణ రాష్ట్ర ప్రత్యామ్నాయం పరిశీలనలోనే ఉందని దిగ్విజయ్ కూడా చెప్పారంటున్నారు. తెలంగాణ కు చెందిన కొందరు ముఖ్యులతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన పార్టీ నేతల నుంచి హామీ పొందిన నేపథ్యంలోనే ఆయన ఆ విధంగా వ్యాఖ్యలు చేశారంటున్నారు. ఈ రెండు జిల్లాలను తెలంగాణలో క లపనున్న విషయం ఆయా జిల్లాల మంత్రులకు ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు టెలిఫోన్లో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 147 చొప్పున అసెంబ్లీ, 21 చొప్పున లోక్‌సభ స్థానాలు ఉండేలా చూడటమే ఇందులోని లక్ష్యమని చెబుతున్నారు.
మూడు ముక్కలతోనే ప్రయోజనం ఎక్కువ
రెండురకాల ఆలోచనలతో రాయల తెలంగాణపై విస్తృత చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు చెబుతున్నారు. 42 లోక్‌సభ సీట్లను రెండు సమాన భాగాలు చేయడం ఇందులో ఒకటి. రాయల తెలంగాణ చేసిన పక్షంలో ఇందులో 21 సీట్లు, ఆంధ్రప్రదేశ్ంలో 21 సీట్లు సమానంగా ఉంటాయి. ఇలా వీలుకాని పక్షంలో రాయలసీమ ప్రాంతంలో బలమైన ఉద్యమాన్ని సృష్టించడం ద్వారా రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్న వారిని ప్రోత్సహించి రాష్ట్రాన్ని మూడుగా విభజించేలా చూడటం మరొకటని అంటున్నారు. కొందరు రాయలసీమ ప్రాంత నేతలతో పాటు ఎంఐఎం, టీఆర్ఎస్లు కూడా రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తుండటంతో.. రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం కోరడం మినహా మరో ప్రత్యామ్నాయం ఉండదని కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు అంచనా వేస్తున్నారు. దిగ్విజయ్‌తో పాటు సీనియర్ నేత పి.చిదంబరం వంటి వారి ఆశీస్సులు కూడా ఈ పథకానికి ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడం వల్లే ప్రయోజనం ఎక్కువని వారు సోనియాకు చెబుతున్నట్లు సమాచారం. గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్‌లు కూడా ఈ ‘పథకాన్ని’ సమర్థిస్తున్నట్టు చెబుతున్నారు.