ప్రత్యేక రైలు బోగీలో నోట్ల కట్టలు, నగలు!
సాక్షి, చెన్నై: ప్రత్యేక రైలు బోగీలో రైల్వే భద్రతాధికారి కరెన్సీ కట్టలు, నగలు తరలిస్తుండగా సీబీఐ వాటిని స్వాధీనంచేసుకున్న ఘటన మంగళవారం తమిళనాడులో జరిగింది. ఆర్పీఎఫ్ ఐజీ అయిన అతణ్ని సీబీఐ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఎస్కే పారి చెన్నై ఐసీఎఫ్‌లో భద్రతాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆర్పీఎఫ్ ఐజీ హోదాలో ఉన్న పారి.. తిరుచ్చి నుంచి చెన్నై మీదుగా హౌరా వెళ్లే రైలులో ప్రత్యేకంగా ఒక ఏసీ బోగీని రిజర్వ్ చేసుకున్నారు.
ఈ బోగీలో నల్లధనం, నగలను తరలిస్తున్నట్లు సీబీఐకి సమాచారం అందింది. దీంతో ఎనిమిది మంది అధికారుల బృందం చెన్నైలోని ఎగ్మూర్ స్టేషన్లో సిద్ధంగా ఉండి అక్కడికొచ్చిన హౌరా రైలులోని ప్రత్యేక బోగీని సీజ్ చేసి రైలును పంపించేశారు. బోగీలో పెద్ద మొత్తంలో నల్లధనం, నగలు ఉన్నట్టు సమాచారం. అవన్నీ ఒకే వ్యక్తివా లేక, రైల్వే యంత్రాంగంలోని ఉన్నతాధికారులవా..? అనే కోణంలో సీబీఐ విచారణ కొనసాగుతోంది.