రూ. కోటి వేతనాన్నీ వద్దన్నారు!
బంపర్ ఆఫర్లను తిరస్కరించిన ఐఐటీ విద్యార్థులు
కాన్పూర్: ఐఐటీ కాన్పూర్‌లో బుధవారం ప్రముఖ కంపెనీలు నిర్వహించిన క్యాంపస్ నియామకాల్లో నలుగురు విద్యార్థులకు ఏడాదికి రూ. కోటికి పైగా వేతన ప్యాకేజీతో బంపర్ ఆఫర్లు వచ్చాయి. కానీ, వారు ఆ ఉద్యోగాలను తిరస్కరించారు. ముగ్గురు యువకులు, ఒక యువతికి ఈ ఆఫర్లు వచ్చాయి.
అయితే, వారిలో ఇద్దరు పైచదువుల కోసం ఉద్యోగాలను తిరస్కరించగా, మరో ఇద్దరు తమకు ఆ ఉద్యోగాలు సరిపడవంటూ చిన్న కంపెనీల్లో రూ. 50 లక్షల వేతనానికి ఉద్యోగాల్లో చేరారని ఐఐటీ కాన్పూర్ ప్లేస్మెంట్ సెల్ చైర్మన్ దీపూ ఫిలిప్ వెల్లడించారు. నలుగురు విద్యార్థులకూ ఏడాదికి రూ. 93 లక్షల వేతనం, ఇతర ప్రోత్సాహకాలతో కలిపి కోటికి పైగా ఆఫర్ ఇచ్చారని తెలిపారు. ఇటీవల ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థికి రూ. 1.54 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఆఫర్ వచ్చింది. మరోవైపు ఐఐటీ మద్రాస్‌లో జరుగుతున్న క్యాంపస్ నియామకాల్లో ఇప్పటిదాకా 487 మంది విద్యార్థులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి.