ఉల్లిపాయలు... కిలో రూ. 1
ఉల్లిపాయలు ఎక్కువగా పండే మహారాష్ట్రలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. లాసల్గావ్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో క్వింటాల్ ఉల్లిపాయలను కనిష్ఠంగా రూ. 100 నుంచి గరిష్ఠంగా రూ. 425 చొప్పున తీసుకుంటున్నారు. అంటే కిలో రూ. 1 నుంచి రూ. 4.25 మాత్రమే అన్నమాట. గడిచిన నాలుగేళ్లలో కూడా బాగా డిమాండ్ ఉన్నప్పుడు గరిష్ఠంగా క్వింటాల్‌కు రూ. 716 మాత్రమే ధర వచ్చింది.
ఉల్లిపాయల దిగుబడి చాలా ఎక్కువగా ఉండటం, డిమాండు మాత్రం అంతగా లేకపోవడంతో రేట్లు పడిపోయాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఆగస్టు 16న క్వింటాల్‌కు రూ. 150 మాత్రమే పలికింది. రైతులు భారీ మొత్తంలో ఉల్లిపాయలు తీసుకొస్తున్నా, డిమాండు మాత్రం అంత లేదని.. దానికితోడు సరుకు కూడా పాడవుతోందని మార్కెట్ కమిటీ చైర్మన్ జయదత్త హోల్కర్ తెలిపారు. మంచి ఉల్లిపాయలకైతే క్వింటాలు రూ. 450 వరకు ధర వస్తోందని, ఓ మాదిరి వాటికి వంద రూపాయల కంటే రావట్లేదని అన్నారు. చాలావరకు సరుకు మధ్యప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల నుంచి వస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో కోసిన ఉల్లిపాయలను ఇప్పుడు మార్కెట్‌కు తెస్తున్నారని, ఇవి నాలుగైదు నెలల క్రితం నాటివి కావడంతో నాణ్యత తగ్గిపోతోందని నాఫెడ్ డైరెక్టర్ నానాసాహెబ్ పాటిల్ చెప్పారు.