ఆ ఊరికా.. మా క్యాబ్ రాదు!
మీరు ఢిల్లీ నుంచి గుర్గావ్ వెళ్లాలనుకుంటున్నారా? అందుకోసం ఓలా లేదా ఉబర్ క్యాబ్‌ల కోసం మాత్రం ప్రయత్నించకండి. ఎందుకంటే, మీరు పిలిచినా అక్కడకు మాత్రం ఈ క్యాబ్‌లు వెళ్లడం లేదు. హరియాణా ప్రభుత్వం కొత్తగా విధించిన కొత్త మోటార్ పన్నే అందుకు కారణం. ప్రతిసారీ గుర్గావ్ వెళ్లినప్పుడల్లా వంద రూపాయల చొప్పున పన్నుచెల్లించాలని అక్కడి సర్కారు హుకుం జారీ చేయడంతో క్యాబ్‌ల వాళ్లు అక్కడకు వెళ్లడం మానుకున్నారు. దాంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. సర్వోదయ డ్రైవర్స్ అసోసియేషన్ ఈ కొత్త పన్నుపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తోంది.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తమ రాష్త్రంలో ప్రవేశించే టాక్సీలన్నీ వంద రూపాయల పన్ను చెల్లించాలని హరియాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పన్ను మొత్తాన్ని సరిహద్దుల్లోనే చెల్లించాల్సి రావడంతో అక్కడ పొడవాటి క్యూలైన్లు ఉంటున్నాయి, దాంతో వాహనాల వాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకుముందు మూడు నెలలకు గాను రూ. 950 చొప్పున ఆర్టీయే వర్గాలకు పన్ను చెల్లిస్తే సరిపోయేది. ఎన్నిసార్లు వచ్చి, వెళ్లినా అదే పన్ను. ఇప్పుడు కొత్త పన్ను వల్ల నెలలో 20 రోజులు వెళ్లినా కనీసం 2వేలు అవుతుందని, ఇది తమకు చాలా భారమని సర్వోదయ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్జీత్ సింగ్ తెలిపారు. పన్ను చెల్లించడానికి కనీసం గంట పాటు వేచి ఉండాల్సి వస్తోందని, దీనిపై తాము వ్యతిరేకత వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదని అంటున్నారు.