రూ.103కే అపరిమిత డేటా, వాయిస్ కాల్స్
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో ఎంట్రీ, డేటా ఖర్చులతో సతమతమవుతున్న వారికి ఏ మేర ఉపయోగపడిందంటే. కంపెనీలు భారీ ఎత్తున్న డేటా ఆఫర్లు ప్రకటించేలా చేసింది. జియో దెబ్బకు కంపెనీలన్నీ డేటా రేట్లను తగ్గిస్తూ వినియోగదారులను అలరిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమతమ డేటా రేట్లను భారీగా తగ్గించగా.. తాజాగా టెలినార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 103 రూపాయలకే అపరిమిత కాలింగ్, 4జీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. యూజర్లందరూ తమ టెలినార్ నెంబర్ పై రూ.103తో రీఛార్జ్ చేసుకుని ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొంది.
ఈ స్కీమ్ కింద యూజర్లకు అందుబాటులో ఉండే అపరిమిత 4జీ డేటా 60 రోజుల పాటు వాడుకోవచ్చట. అదేవిధంగా అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని 90 రోజులు వరకు వాడుకోవచ్చని తెలిపింది. రూ.103 ప్యాక్ కింద కొత్త 4జీ యూజర్లైతే 25 రూపాయల ఉచిత టాక్ టైమ్ తో పాటు నిమిషానికి 25 పైసలు మాత్రమే కాల్ ఛార్జ్ భరించేలా రూపొందించింది. అదేవిధంగా అపరిమతి 4జీ డేటా లిమిట్ కూడా వారు రోజుకు 2జీబీ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. 2జీబీ డేటా అయిపోయిన తర్వాత డేటా స్పీడ్ 128కేబీపీఎస్ కు పడిపోతుంది. టెలినార్ 4జీ సర్వీసులను ఆఫర్ చేసే అన్ని సర్కిళ్లలో ఈ ప్లాన్ అందుబాటులో ఉంచనున్నట్టు కంపెనీ పేర్కొంది.