రూ.13 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం
గుంటూరు ఈస్ట్: వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను, వారికి సహకరిస్తున్న ఓ రౌడీషీటరును గుంటూరు రూరల్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి, రూ.13 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. రూరల్ అడిషనల్ ఎస్పీ వై.టీ.నాయుడు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వాడపల్లి శ్రీను ,షేక్ యూసఫ్ బాషా గతంలో పలు చోరీ కేసుల్లో అరెస్టయి బాపట్ల జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. జైలులో బాపట్లకు చెందిన రౌడీషీటర్ పాలేటి మాణిక్యారావు వీరికి పరిచయమయ్యాడు. మాణిక్యారావు లా అండ్ అర్డర్ కేసులో జైలుకు రావడం వలన ముందుగానే విడుదలయ్యాడు. శ్రీను, యూసఫ్ బాషాలను కూడా బెయిల్పై బయటకు తీసుకువచ్చాడు. వెంటనే శ్రీను, యూసఫ్ బాషాలు బాపట్లలోని ఓ ఇంట్లో చోరీ చేసి మాణిక్యారావు తమకు బెయిల్ కోసం పెట్టిన ఖర్చును తిరిగి ఇచ్చారు. అనంతరం ముగ్గురూ ఓ ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి దానిపై తిరుగుతూ రెక్కీ నిర్వహించి పలు పట్టణాల్లో, ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఏప్రిల్లో జైలు నుంచి వచ్చిన వీరు 3 నెలల్లోనే 9 చోట్ల చోరీలకు పాల్పడ్డారు. వరుస చోరీలపై విచారణ చేసిన సీసీఎస్ పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేసి 13 కిలోల విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ఎల్ఈడీ∙టీవి ,85 వేల విలువ కలిగిన డాలర్లు స్వాధీనం చేసుకున్నారు.
15 నిమిషాల్లోనే చోరీ..
వాడపల్లి శ్రీను, యూసఫ్ బాషాలు రాత్రిపూటే కాక పట్టపగలు కూడా ఇళ్లల్లో చోరీలు చేయడంలో సిద్ధహస్తులు. ముందు చోరీ చేయదలచుకున్న ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తారు. పథకం ప్రకారం ఒకరు బయట ఉండి సెల్ఫోన్లో బయట విషయాలు తెలియ చేస్తుంటాడు. లోపలకు వెళ్లిన వారు 15 నిమిషాల్లోనే చోరీ పూర్తి చేసి బయటకు వస్తారు. నిందితుల నుంచి చోరీసొత్తు కొనుగోలు చేసిన ఓ ప్రముఖ వ్యక్తినుంచి కూడా సొత్తును పోలీసులు రాబట్టారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన సీసీఎస్ డీఎస్పీ ఎన్.కృష్ణ కిషోర్ రెడ్డి, సీఐ చిట్టెం కోటేశ్వరరావు ,ఎసై ్స కిరణ్, ఏఎస్ఐ సాయికుమార్, కానిస్టేబుల్ గురవయ్య , ఇతర సిబ్బందిని అడిషనల్ ఎస్పీ వై.టి.నాయుడు అభినందించారు.