గురుకుల విద్యాలయాలకు మహర్దశ
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో 12 సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. నాలుగు బాలురకు, ఎనిమిది బాలికలకు కేటాయించారు. ఇందులో ఐదో తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్ వరకు ఉచితంగా చదువుకోవచ్చు. విద్యార్థులకు తరగతుల నిర్వహణతోపాటు వసతులలో ఇబ్బందులు తలెత్తరాదనే ఉద్దేశంతో ఎస్సీ సబ్ ప్లాన్ కింద జిల్లాలోని 12 పాఠశాలలకు ప్రభుత్వం రూ.14.10 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి. ఇన్నేళ్లుగా అరకొర వసతులతో అవస్థలు పడిన విద్యార్థులకు తిప్పలు తీరనున్నాయి. విద్యాప్రమాణాలు మెరుగుపడనున్నాయి.
జిల్లాలో పాఠశాలలు
జిల్లాలో బాలురకు ఆసిఫాబాద్, సిర్పూర్(టి), ఇందారం, ముథోల్‌లో పాఠశాలలు ఉన్నాయి. అదేవిధంగా సిర్పూర్(టి), బెల్లంపల్లి, లక్సెట్టిపేట, కడెం, సారంగాపూర్, బోథ్, పోచంపాడు(లెఫ్ట్), ఆదిలాబాద్‌లలో బాలికలకు పాఠశాలలను ఏర్పాటు చేశారు. మంజూరైన నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణం, లైబ్రరీ, ప్రయోగశాల, పడక గదులు, భోజనశాల, క్రీడా సామగ్రి, ప్రిన్సిపాల్, బోధన, బోధనేత ర సిబ్బందికి క్వార్టర్లు, ప్రహరీ నిర్మించాలి. ప్రతి పాఠశాలలో మంజూరైన నిధులతో పనులు పూర్తి చేసినచో విద్యార్థుల దశ మారనుంది.
మరో రెండు మంజూరు
ఒక్కొక్క పాఠశాలకు రూ.14 కోట్ల చొప్పున జిల్లాకు కొత్తగా రెండు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయి. వీటిలో ఒకటి చెన్నూరు(బాలికలు), బెల్లంపల్లి(బాలురు). చెన్నూరు పాఠశాల వల్ల కోటపల్లి, వేమనపల్లి మారుమూల మండలాల విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా బెల్లంపల్లి పాఠశాలతో నెన్నెల, భీమిని, దహెగాం మండలాల విద్యార్థులకు ఉపయోగం ఉంటుంది.