ఏడాదికి కోటిన్నర వేతన ప్యాకేజి!
ఐఐటీలో చదవడం అంటేనే అదో పెద్ద కల. ఇక అక్కడ చేరితే చాలు.. భారీ మొత్తంలో వేతనాలు గ్యారంటీ అంటారు. సరిగ్గా ఇలాగే జరిగింది. ఐఐటీ ఖరగ్పూర్లో చదివిన ఓ విద్యార్థికి ఏకంగా ఏడాదికి కోటిన్నర రూపాయల ప్యాకేజితో బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చింది. మొత్తం 27 కంపెనీలు తమ వద్దకు క్యాంపస్ ప్లేస్మెంట్లకు వచ్చాయని, అవి 163 మందికి ఆఫర్లు ఇచ్చాయని, వాటిలో ఇదే అత్యంత ఎక్కువ జీతమని ఐఐటీ ఖరగ్పూర్ అధికారులు తెలిపారు. ఇక స్వదేశీ కంపెనీల్లో అయితే.. అత్యధికంగా 42 లక్షల రూపాయల ప్యాకేజీ వచ్చింది.
అమెరికాలోని ఓ కంపెనీ మాత్రం దాదాపు కోటిన్నర.. అంటే, 2.50 లక్షల డాలర్ల వార్షిక ప్యాకేజీని ఆఫర్ చేసింది. అయితే.. ఈ భారీ ఆఫర్ కొట్టేసిన కుర్రాడి పేరు మాత్రం ఐఐటీ అధికారులు వెల్లడించలేదు. దీనివల్ల అతడిపై లేనిపోని ఒత్తిడి పెరుగుతుందని వాళ్లన్నారు. ఇప్పటివరకు ఐఐటీ ఖరగ్పూర్ విద్యార్థులకు ఇంత భారీ ప్యాకేజి రావడం కూడా ఇదే ప్రథమం. ఇక, ఇదే సంస్థలో గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ కూడా చదివారు.