ఇప్పటి వరకు రూ. 161.3 కోట్ల విరాళాలు
చెన్నై : సీఎం వరద నివారణ నిధికి విరాళాల రాక పెరిగింది. సోమవారం నాటికి రూ.161 కోట్ల 30 లక్షల 29 వేల విరాళాలు వచ్చి చేరాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు జిల్లాల్లో వరదలు సృష్టించిన పెను విలయం గురించి తెలిసిందే. బాధితుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై చర్యలు తీసుకుంటోంది. నిధుల కొరత వెంటాడుతుండడంతో ఆపన్నహస్తం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సైతం చేతులు చాచాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నిధులు త్వరితగతిన మంజూరు చేయాలని కేంద్రాన్ని సీఎం జయలలిత ఓ వైపు విజ్ఞప్తి చేస్తూ వస్తుంటే, మరో వైపు మానవతా హృదయులు, బడా సంస్థలు తాము సైతం అంటూ నష్టంలో , కష్టంలో పాలు పంచుకునేందుకు ముందుకు వస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు తమ నెల జీతాన్ని అందించడంతో పాటుగా నియోజకవర్గ అభివృద్ధి నిధుల్ని వరద బాధిత ప్రాంతాలకు మళ్లించే పనిలో పడ్డారు.
అనేక ప్రైవేటు రంగ సంస్థలు విరాళాల్ని అందించే పనిలో పడ్డాయి. సోమవారం సుందరం సంస్థ రూ.3 కోట్లు, ైనె వేలి లిగ్నైట్ కార్పొరేషన్ రూ.2.5 కోట్లు, టీవీ అయ్యంగార్ అండ్ సన్స్ రూ.2.5 కోట్లు, యునెటైడ్ ఇండియా రూ.2 కోట్లు, ఆమ్ వే ఇండియా ఎంటర్ ప్రైజస్ రూ.2 కోట్లు, దాల్మియా సిమెంట్స్ రూ.1 కోటి చొప్పున విరాళాలు ప్రకటించాయి.
వీటితో పాటుగా మరికొన్ని సంస్థల ప్రతినిధులు ఉదయం సచివాలయంలో సీఎంను కలుసుకుని విరాళాలకు చెక్కులను అందజేశారు. తాజాగా వచ్చిన విరాళాలతో మొత్తంగా ఇప్పటి వరకు 161 కోట్ల 30 లక్షల 29 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతాలోకి చేరి ఉన్నట్టు సచివాలయం వర్గాలు ప్రకటించాయి.