జెరాక్స్ తీసి చెలా‘మనీ’
రూ.2 వేల కొత్త నోటుకు నకిలీ
యువకులను అదుపులో తీసుకున్న పోలీసులు
ఆరిలోవ: కొత్త రూ.2 వేల నోటుకు కలర్ జెరాక్స్ తీసి ఆరిలోవ పరిసర ప్రాంతాల్లో చెలామణీ చేస్తున్న ఇద్దరు యువకులు పోలీసులకు చిక్కారు. ఆరిలోవ సీఐ సీహెచ్ తిరుపతిరావు మంగళవారం తెలిపిన వివరాల మేరకు.. ఎస్బీఐ ఇన్సూ్యరెన్స్లో పనిచేస్తున్న కంచరపాలెం ప్రాంతానికి చెందిన మల్ల సత్యనారాయణ, అక్కయ్యపాలెం ప్రాంతంలో ఫొటో స్టూడియో నడుపుతున్న ఆసపు యుగంధర్, ఫౌల్ట్రీ ఫీడింగ్ వర్క్ చేస్తున్న సింహాచలం ప్రాంతం పాత గోశాలకు చెందిన డోల ఎల్లాజిలు స్నేహితులు. యుగంధర్ ఫొటో స్టూడియోలో ఇటీవల చెలామణీలోకి వచ్చిన కొత్త రూ.2 వేల నోట్లకు కలర్ జెరాక్స్ తీశారు. అచ్చం నిజమైన నోటు లాగే వాటిని తయారు చేశారు. ఈ నెల 26న సత్యనారాయణ విశాలాక్షినగర్‌లోని బంక్‌కు వెళ్లి రూ.300 పెట్రోల్ పోయించుకున్నాడు.
తన వద్ద ఉన్న జెరాక్స్ రూ.2 వేల నోటును అక్కడి సిబ్బందికి ఇవ్వగా..వారు నకిలీ నోటుగా గుర్తించి బంక్ నిర్వాహకుడు సంపత్‌రావు వెంకటరమణకు తెలిపారు. అతను ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే వారు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న సుమారు 15 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతనికి సహకరించిన యుగంధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎల్లాజి పరారీలో ఉన్నాడు. వీరి ముగ్గురూ జల్సాలకు అలవాటుపడి డబ్బు సంపాదనలో అడ్డదారులను ఎంచుకొన్నారు. ఎల్లాజీపై గతంలో నగరంలో పలు పోలీస్స్టేషన్లలో గొలుసు దొంగతనాల కేసులు, యుగంధర్‌పై ఓ యువతిపై అత్యాచారయత్నం కేసు నమోదై ఉన్నట్టు సీఐ తెలిపారు. యుగంధర్‌ను పట్టుకోవడంలో హెచ్‌సీ విజయకుమార్, కానిస్టేబుళ్లు భాస్కరరావు, గణపతి సహకరించారు. ఎస్ఐ జి.సంతోష్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు