ఒక్క రోజే రూ. 22 కోట్ల విరాళాలు
తమిళనాడును ఆదుకునేందుకు సంఘాలు, సంస్థలతో పాటుగా అన్ని వర్గాల వారు తరలుతున్నారు. తొమ్మిది అతి పెద్ద సంస్థలు తమ విరాళాల్ని ప్రకటించడంతో పాటుగా ఆ మొత్తాన్ని సీఎం జయలలితకు అందించారు. రూ. 22 కోట్ల మేరకు విరాళాలు సచివాలయానికి మంగళవారం ఒక్కరోజే వచ్చి చేరింది.
చెన్నై : ప్రకృతి తాండవానికి తమిళనాడు విలవిలలాడుతోంది. ప్రధానంగా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. తాము అండగా ఉన్నామంటూ స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు చెన్నై వైపుగా కదిలివచ్చి సహాయంలో నిమగ్నమయ్యాయి. వరద బాధితులకు ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, వస్త్రాలు, ఇంటి సామగ్రి అందించే పనిలో పడ్డాయి. అయితే, ఈ పెను విలయానికి రోడ్లు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
పంట పొలాలు, పంటలు వరద పాలయ్యాయి. ప్రజలకు తీవ్ర నష్టం ఏర్పడడంతో వారిని ఆదుకునేందుకు నష్టపరిహారం ప్రకటించారు. కోట్లాది రూపాయల మేరకు నష్టం వాటిల్లి ఉండడంతో తమిళనాడును ఆదుకునేందుకు ఇతర రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక, బీహార్ వంటి రాష్ట్రాలు విరాళం ప్రకటించగా, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ ఏకంగా రూ. 25 కోట్లు ప్రకటించి అందరి కన్నా ముందు వరుసలో నిలబడ్డారు.
ఓవైపు కేంద్రం రెండు దఫాలుగా ప్రకటించిన రూ. 1940 కోట్లతో సహాయకాలను వేగవంతం చేసి ఉన్న తరుణంలో, రాష్ర్ట ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చేందుకు భారీ సంస్థలు,. పరిశ్రమల యాజమాన్యాలు ముందుకు వస్తున్నాయి. అన్ని వర్గాల వారు విరాళాల్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించే పనిలో పడ్డారు. కొన్ని చోట్ల రాష్ట్రంలో వరద సహాయ హుండీల్ని చేత బట్టి నిధుల్ని సేకరిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
విరాళాలు : మంగళవారం తొమ్మిది సంస్థలకు చెందిన యాజమాన్యాలు తమ వంతుగా సహాయాన్ని ప్రకటించాయి. విరాళం మొత్తాల్ని సీఎం జయలలితను కలుసుకుని అందజేశాయి. సచివాలయంలో సీఎంను కలుసుకున్న వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. ఈ ఒక్క రోజు రూ. 22 కోట్ల మేరకు విరాళం వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో టీవీఎస్ గ్రూప్ రూ. 5కోట్లు, మాతా అమృతామయి తరపున రూ. 5కోట్లు, టఫే సంస్థ రూ. 3కోట్లు, జాయ్‌లుకాస్ రూ. 3కోట్లు, ఇండియా సిమెంట్స్ రూ. ఆకోట్లు, హుండాయ్ రూ. ఆ కోట్లు, స్టేట్ బ్యాంక్ రూ. కోటి, సిటీ యూనియన్ బ్యాంక్ రూ కోటి చొప్పున విరాళాల చెక్కులను సీఎం జయలలితకు అందజేశారు.