ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ బుధవారం మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కంటే చౌక ధరలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా రూ.259 రీచార్జ్ పై 10జీబీ 4జీ డేటా ఆఫర్ చేస్తోంది. వినియోగదారులు కొత్తగా కొనుగోలు చేసిన ఏ 4 జీ స్మార్ట్ ఫోన్ కైనా ఈ ఆఫర్ ను అందించనుంది. ఈ ఇన్విటేషనల్ ఆఫర్ ద్వారా దేశమంతా తాము అమలు చేస్తున్న4జీ నెట్ వర్క్ ను యూజర్లకు అందుబాటులోకి వచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎయిర్ టెల్ బిజినెస్ డైరెక్టర్ అజయ్ పూరి తెలిపారు.
ఒక జిబి డేటా తక్షణమే వినియోగదారుని ఖాతాలో జమ చేయబడుతుందనీ, మిగిలిన 9 జీబీ డేటా మై ఎయిర్ టెల్ ఆప్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చని ఎయిర్ టెల్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. 4 జీ అందుబాటులో లేనిచోట 3జీ డాటా వాడుకోవచ్చని తెలిపింది. గరిష్టంగా 90 రోజుల్లో మూడుసార్లు రీచార్జ్ చేసుకునేందుకు ఈ తాజా ఆఫర్ అనుమతినిస్తుంది. ఇటీవల గుజరాత్, మధ్య ప్రదేశ్, చత్తీస్గడ్ లో ప్రారంభించిన ఈ ఆఫర్ ను ఇపుడు దేశమంతా వర్తింపచేస్తోంది.
కాగా ఆగస్ట్ లో రూ.250 రీచార్జ్ తో 10 జీబీ 4 జీ డాటాను కేవలం శాంసంగ్ గెలాక్సీ జె సీరిస్ స్మార్ట్ ఫోన్లకు మాత్రమే ఆఫర్ చేసింది. తాజా ఆఫర్ ప్రకారం 4 జీ స్మార్ట్ ఫోన్లు అన్నింటికీ ఈ డాటా సేవలు వర్తింప చేస్తోంది.