తొలి రోజు రూ. 27 కోట్లు వసూలు
న్యూఢిల్లీ: బజరంగీ భాయ్‌జాన్ చిత్రం తొలి రోజే రూ.27 కోట్లు వసూళు చేసింది. ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ నటించిన అన్ని చిత్రాల రికార్డులను ఈ చిత్రం చెరిపేసింది. సెలవు కాకుండా శుక్రవారం రోజు రిలీజై ఇంతగా కలెక్షన్లని రాబట్టిందని చిత్ర యూనిట్ సభ్యుడు ఒకరు తెలిపారు. ఇక వారంతమైన శని, ఆదివారాల్లో మరింతగా కలెక్షన్లను రాబట్టవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రం 5000 స్క్రిన్స్లో ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో విడుదలయింది.వెండితెరపై చాలా కాలం తరువాత గుబాళించిన మానవతా పరిమళంగా 'బజరంగీ భాయ్‌జాన్' శుక్రవారం రిలీజైంది.
కథ విషయానికొస్తే...అన్నీ లెక్కలేసుకొనే చేస్తే దాన్ని జీవితమనీ, మనల్ని మనుషులనీ ఎవరూ అనరు. అనలేరు. యంత్రానికి లేని మనసుంది కాబట్టే, మనం ప్రత్యేకమయ్యాం. కొన్ని భావాలకూ, బంధాలకూ లాజిక్‌లు ఉండవు. అది అంతే! కానీ, మనకు మనమే కులం, మతం, ప్రాంతం, భాష, దేశం - అనే విభజన రేఖలు గీసుకున్నాం. మన లాంటి తోటి మనిషిని కూడా ఈ మరుగుజ్జు ప్రమాణాలతో జడ్జ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సాటివాడికి చేయందించడానికి కూడా ఈ లెక్కలు వేస్తాం. సరిగ్గా అలాంటి మనస్తత్త్వమున్న మన లాంటి ఒక వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో తన దేశం, మతం కాని ఒక చిన్నారికి దగ్గరైతే? మాటలు రాని ఆరేళ్ల ఆ మూగ చిన్నారిని సురక్షితంగా తన ఇంటికి చేర్చడానికి జీవితాన్నే రిస్క్‌లో పడేసుకుంటే? ఆ క్రమంలో డబ్బు, ప్రేమ, పెళ్ళి, చివరకు ప్రాణం కూడా పణంగా ఒడ్డడానికి సిద్ధపడితే? మనుషుల మధ్య పెరగాల్సింది ప్రేమే తప్ప, కుల, మత, ప్రాంతాల పేరిట ద్వేషం కాదని గుర్తు చేసేలా 'బజరంగీ భాయ్‌జాన్' తెరకెక్కింది.