చిన్నమ్మ శశికళకు మరో షాక్!
చెన్నై : అమ్మ తర్వాత అమ్మగా అన్నాడీఎంకే సారథ్య బాధ్యతలు చేపట్టిన శశికళకు అడుగడుగునా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చిన్నమ్మగా గుర్తింపు తెచ్చుకోవాలని శశికళ చేస్తున్న విశ్వ ప్రయత్నాలకు ఆర్కే నగర్ వాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే మాజీ మంత్రి టీటీవీడీ దినకరన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ జరిమానా విధించింది. పెరా ఉల్లంఘన కేసులో దినకరన్‌కు ఈడీ రూ.28 కోట్ల జరిమానా విధించినట్టు మద్రాసు హైకోర్టు శుక్రవారం ధృవీకరించింది. జయలలిత మృతితో పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ, అమ్మ పోటీచేసే ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
కానీ ఆర్కే నగర్ వాసులు మాత్రం శశికళను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓట్లు అడగడానికి తమ వద్దకు రావద్దని, అమ్మ కోసమే తాము ఇక్కడ ఉంటున్నామంటూ చెబుతున్నారు. ఆ పార్టీలోనూ కొంతమంది నాయకులు, కార్యకర్తలు కూడా శశికళ ఎప్పటికీ తమిళనాడుకు చిన్నమ్మ కాలేరని తేల్చిచెబుతున్నారు. మరోవైపు నుంచి జయలలిత వారసురాలుగా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆమె మేనకోడలు దీపా జయకుమార్ తీవ్రంగా పావులు కదుపుతున్నారు. ఆర్కే నగర్ వాసుల నుంచి దీపా జయకుమార్‌కు మద్దతు లభిస్తోంది. దీపా మాత్రమే మా దగ్గర నుంచి పోటీ చేయాలని ఆర్కే నగర్ వాసులు కోరుతున్నారు.