కబ్జాకోరల్లో సర్కార్ భూమి
కేశ్వాపూర్లో రూ.2కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
హుస్నాబాద్రూరల్ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. కోట్ల విలువైన సర్కార్ భూములు అన్యాక్రాంతమవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఏం చేయాలో తెలియక ప్రజాప్రతినిధులు తలపట్టుకుంటున్నారు. కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకుని పేదదళితులకు పంపిణీ చేయాలని పలువురు కోరుతున్నారు. హుస్నాబాద్ మండలం కేశ్వాపూర్ గ్రామ పరిధిలోని జీడి గట్టు సమీపంలోని సర్వే నంబర్ 154లో 52ఎకరాల సాగుకు అనువైన ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో 2.20 ఎకరాలను గౌడ సంఘానికి ప్రభుత్వం కేటాయించగా.. మిగిలిన భూమిలో గ్రామస్తులు గొర్లు, పశువులకు మేతకోసం వినియోగించుకునేవారు. ఇటీవల భూమి తమదేనంటూ 30 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇటీవల గ్రామ సందర్శనకు వచ్చిన తహసీల్దార్ టి.వాణికి ఫిర్యాదు చేశారు. 10ఎకరాలను గౌడ సంఘం, మరో 10 ఎకరాలను సరిహద్దులోని రైతుల, ధర్మారం శివారులో 10 ఎకరాలు ఆక్రమించుకుని సాగు చేస్తున్నారని వివరించారు. ఇక్కడ ఎకరాకు రూ.4 లక్షలవరకు ధర పలుకుతుంది. ఈ లెక్కన దాదాపు రూ.2కోట్ల భూమి కబ్జాకు గురైంది. ప్రభుత్వ భూమిని సర్వే చేసి హద్దులు పెట్టాలని గ్రామస్తులు కోరారు.
పేదల దరిచేరని భూపంపిణీ పథకం
ఎస్సీ, ఎస్టీల కుటుంబాల అభివద్ధి కోసం భూపంపిణీ పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తయినా హుస్నాబాద్ మండలంలో ఒకరికీ భూపంపిణీ జరగలేదు. కేశ్వాపూర్లో భూమిలేని ఎస్సీ కుటుంబాలు 20 వరకు ఉన్నాయి. ప్రభుత్వం లక్షలు ఖర్చు పెట్టి భూమికొనుగోలు చేసే బదులు గ్రామంలో ఉన్న 60 ఎకరాలను స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని పలువురు కోరుతున్నారు. భూఅభివద్ధి పథకం కింద బావుల తవ్వకానికి రుణాలు మంజూరు చేస్తే ఆ కుటుంబాలు బతుకుతాయని ప్రజాప్రతినిధులు అంటున్నారు. కలెక్టర్ స్పందించి కబ్జా భూములను స్వాధీనం చేసుకుని భూపంపిణీ చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వ భూమికి హద్దులు పెట్టాలి
సర్వే నంబర్ 154లో 50 ఎకరాల భూమి కబ్జాకు గురవుతోంది. దీనిపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు చెప్పినం. సర్వే చేసుడు లేదు.. భూమి ఇచ్చుడు లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ భూమిని సర్వే చేసి పంచాయతీకి అప్పగిస్తే హరితహారం కింద మొక్కలు పెంచుతాం.
–గంధపు రమేశ్,సర్పంచ్
సర్వే చేసి హద్దులు వేస్తాం
కేశ్వాపూర్లోని సర్వే నంబర్ 154లో 52 ఎకరాల భూమిలో 2.20ఎకరాల భూమిని గౌడ సంఘానికి ప్రభుత్వం ఇచ్చింది. ఇక ఎవరికి ఎలాంటి భూపట్టాలు ఇవ్వలేదు. కబ్జా చేస్తున్న విషయాన్ని గ్రామస్తులు నా దష్టికి తెచ్చారు. దీనిపై సర్వే చేసి కబ్జా చేసిన భూమి స్వాధీనం చేసుకుంటాం.