రూ.40 కోట్లు ఇస్తే ఎమ్మెల్సీ మీదే..
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆఫర్
ఆయన మాటల రికార్డింగ్‌తో సీడీ వెలుగులోకి
సాక్షి, బెంగళూరు: ఓ ఎమ్మెల్సీ పదవి కోరుకునే ఆశావహుడైన అభ్యర్థి నుంచి మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు కుమారస్వామి ఏకంగా రూ. 40 కోట్లు డిమాండ్ చేసినట్లు వెలువడిన వార్త శనివారం మీడియాలో తీవ్ర దుమారం సృష్టించింది. కర్ణాటక రాష్ట్రం బిజాపుర జిల్లాకు చెందిన విజుగౌడ పాటిల్ అనుచరులు కొంతమంది బెంగళూరులోని జేడీఎస్ ప్రధాన కార్యాలయంలో కుమారస్వామితో భేటీ అయ్యారు. విజుగౌడకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ వారు ఒత్తిడి తెచ్చారు. వారి మధ్య జరిగిన సంభాషణను అక్కడున్న వారిలో ఒకరు, తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసి, సీడీలుగా మార్చి మీడియాకు అందించారు.
కన్నడ టీవీ చానళ్లలో అవి విస్తృతంగా ప్రసారమయ్యాయి...‘నా చేతుల్లో ఏమీ లేదు. ఓటు వేయడానికి ఒక్కో ఎమ్మెల్యే కోటి రూపాయలు అడుగుతున్నారు. ఎన్నికల్లో గెలవడానికి వారు చాలా ఖర్చు చేశారు. కష్టాల్లో ఉన్నారు’ అని కువ ూర స్వామి మాట్లాడిన సంభాషణ సీడీలో ఉంది. దీనిపై కుమారస్వామి మీడియాతో స్పందిస్తూ,... ‘కొన్ని మీడియా సంస్థలు తనపై, తన పార్టీపై కక్షకట్టి ఆరోపణలు చేస్తున్నాయి. పార్టీలో అంతర్గత విషయాలు బయటకు రాకపోవడం మంచిది. అన్ని పార్టీల్లో ఇలాంటివి సహజం. ఇదేదో పెద్ద అపరాధం అన్నట్లు చెబుతున్నారు. ఎంత ఖర్చు చేస్తే ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్తున్నారో మీకు తెలియదా?’ అని ఎదురు ప్రశ్నించారు.