ఎఫ్ఐఐలపై పన్ను సబబే: సీఐఐ
న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ/ఎఫ్పీఐ) రూ.40 వేల కోట్లు చెల్లించాలంటూ కేంద్రం పన్ను డిమాండ్ నోటీసులు ఇవ్వడం సబబేనని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) పేర్కొంది. పన్ను ఎగవేతదారులకు భారత్ స్వర్గధామం(ట్యాక్స్ హెవెన్) కాదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది. ‘రెట్రోస్పెక్టివ్ పన్నుల(పాత ఒప్పందాలు, లావాదేవీలపై పన్ను వర్తింపు)కు వ్యతిరేకమన్న వాదనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అయితే, పన్ను బకాయిలను వసూలు చేయబోమని ఎక్కడా చెప్పలేదు. భారత్ ఇప్పుడూ, ఎప్పుడూ కూడా ట్యాక్స్ హెవెన్ కాబోదు.
మీరు(ఎఫ్ఐఐలు) ఇక్కడ వ్యాపారం చేయాలనుకుంటే సంబంధిత పన్నులన్నీ చెల్లించాల్సిందే. దీనిలో ఎలాంటి తప్పూలేదు’ అని కొత్తగా ఎన్నికైన సీఐఐ ప్రెసిడెంట్ సుమిత్ మజుందార్ వ్యాఖ్యానించారు. మూలధన లాభాలపై ఎఫ్ఐఐలు 20 శాతం కనీస ప్రత్నామ్నాయ పన్ను(మ్యాట్) బకాయిలను చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖ ఇటీవలే నోటీసులు జారీచేయడం.. దీనిపై ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర విమర్శలు రావడం తెలిసిందే. ఈ పన్ను విధింపు చెల్లదంటూ ఎఫ్ఐఐలు చేసిన అప్పీలును అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్స్(ఏఏఆర్) తోసిపుచ్చడంతో ఐటీ శాఖ నోటీసులు పంపింది. ఈ పన్ను బకాయిల మొత్తం రూ.40 వేల కోట్లుగా అంచనా.
ఈ ఏడాది ముప్పావు శాతం రేట్ల కోత...
ప్రతి ద్రవ్యోల్బణం(డిఫ్లేషన్) ధోరణి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఏడాదిలో ఆర్బీఐ ముప్పావు శాతం మేర వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని మజుందార్ అంచనా వేశారు. వృద్ది, పెట్టుబడుల పునరుత్తేజానికి ఈ చర్యలు దోహదం చేస్తాయన్నారు. రానున్న పాలసీ సమీక్షలో(జూన్ 2న) పావు శాతం రేట్ల కోతకు ఆస్కారం ఉందన్నారు.