ఇండియాలో అత్యంత ఖరీదైన వీధి ఏది?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వీధి.. హాంగ్‌కాంగ్‌లోని పొల్లాక్ స్ట్రీట్స్. రెండోది.. లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్. మరి ఇండియాలో అత్యంత ఖైదీదైన వీధి ఏది?.. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు దేశంలోనే బిగ్గెస్ట్ డీల్‌గా రికార్డులకెక్కిన భవంతి అమ్మకం వివరాలు చూద్దాం..
ఆదిత్యా బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా.. ప్రస్తుతం ముంబైలో తానుంటున్న ఇంటికి కొద్ది దూరంలోనే మరో భవంతిని కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఏకంగా రూ. 425 కోట్లు వెచ్చించాడు. ఇప్పటివరకు మనదేశంలో ఒక భవంతిని ఇంత భారీ మొత్తానికి కొన్న మొదటివ్యక్తి మంగళం సారే! ఆ భవంతి పేరు జైతా హౌజ్. అరేబియా తీరానికి అతి సమీపంలోని మలబార్ హిల్స్‌లో ఉన్న ఈ బంగళా గురించి ముంబైలో ఎవరినడిగినా చెప్పేస్తారట!
అంత పేరున్న ఈ బంగళాకు అసలు ఓనర్లు.. పేపర్ పరిశ్రమ దిగ్గజాలైన జైతా సోదరులు. ఏదో అవసరం కోసం జోన్స్ లాంగ్ అనే అంతర్జాతీయ బిడ్డింగ్ కంపెనీ ద్వారా దానిని అమ్మకానికి పెట్టారు. అలా సోమవారం జరిగిన వేలం పాటలో 25 వేల చదరపు అడుగుల జైతా హౌజ్‌ను అక్షరాల 425 కోట్లకు సొంతం చేసుకున్నాడు కుమార మంగళం బిర్లా . ఇక మన ప్రశ్నకు సమాధానమేంటో ఇప్పటికే ఊహించి ఉంటారే..
అవును. మంగళంసార్ కొత్త భవంతి ఉన్న మలబార్ హిల్స్ లోని లిటిల్ గిబ్స్ స్ట్రీటే మన దేశంలో ఖరీదైన వీధిగా కీర్తి గడిస్తున్నది. గతంలో ఇదే ప్రాంతంలో ఉన్న మహేశ్వరి హౌజ్ రూ.400 కోట్లకు అమ్ముడుపోయింది. దివంగత సైంటిస్ట్ హోమీ జహంగీర్ బాబా భవంతిని వేలం వేయగా రూ.372 కోట్లు పలికింది. మలబార్ హిల్స్ ప్రాంతంలో ప్రస్తుతం ఒక చదరపు అడుగు స్థలం రూ. 1.80 లక్షలకు పైగా పలుకుతున్నదట! మొత్తం ఖరీదులో 10 శాతాన్ని ముందే చెల్లించి జైతాహౌజ్ లోకి దిగనున్న బిర్లా గారు మిగతా డబ్బును విడతలవారిగా చెల్లించనున్నట్లు ఆక్షన్ నిర్వాహకులు చెప్పారు. 'ఈ డీల్ గురించి మేమ మాట్లాడితే బాగోదు' అని బిర్లా సంస్థ ఉద్యోగులు అన్నారు.