‘ఆసరా’కు బ్రేక్
మోర్తాడ్ /బాన్సువాడ :పెద్దనోట్లు రద్దుతో ఏర్పడిన కష్టాలు ఆసరా పింఛన్ లబ్ధిదారులనూ వెంటాడుతున్నాయి. రూ. 500, రూ. యి నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ నెలకు సంబంధించిన ఆసరా పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది. పింఛన్లను లబ్ధిదారులకు చెల్లించడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కానీ బ్యాంకుల్లో కొత్త రూ. 2 వేల నోట్లు మాత్రమే లభిస్తుండడంతో ఆసరా పింఛన్లు ఎలా పంపిణీ చేయాలో అధికారులకు అర్థం కావడం లేదు.
తపాలా శాఖ అధికారులు బ్యాంకుల నుంచి డబ్బును డ్రా చేయగా బ్యాంకర్లు మొత్తం రూ. 2 వేల నోట్లను అందించారు. వికలాంగులకు రూ. 1500 ఇస్తుండగా, ఇతర లబ్ధిదారులకు రూ. వెయి చొప్పున పింఛన్ ఇస్తారు. తపాలా శాఖ వద్ద రూ. 2 వేల నోట్లు మాత్రమే అందుబాటులో ఉండడంతో ఇద్దరు లబ్ధిదారులకు కలిపి ఒక నోటు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. పింఛన్ డబ్బును చిల్లర విడిపించుకుని లబ్ధిదారులు పంచుకోవాలని సూచించాలని అధికారులు భావించారు.
అయితే ఈ విధానం వల్ల పింఛన్ లబ్ధిదారుల మధ్య వివాదం తలెత్తే అవకాశం ఉందని భావించిన అధికారులు పింఛన్ల పంపిణీని జిల్లా వ్యాప్తంగా నిలిపివేశారు. డ్రా చేసిన సొమ్మును మళ్లీ బ్యాంకులోనే డిపాజిట్ చేయాలని తపాల శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. బ్యాంకులకు రూ.100 నోట్లు, కొత్త రూ. 500 నోట్లు చేరిన తర్వాతే ఆసరా పింఛన్లు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. బ్యాంకులకు చిన్న నోట్లు సరఫరా కావడానికి మరో వారం, పది రోజుల సమయం పడుతుంది. దీంతో అప్పటి వరకు లబ్ధిదారులు ఆగాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.
పింఛన్లకు సరిపడా మంజూరు కాని సొమ్ము
జిల్లాలోని ఆసరా పింఛన్ల లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా సొమ్మును ప్రభుత్వం మంజూరు చేయలేదని తెలిసింది. లబ్ధిదారుల సంఖ్యలో 30 శాతం మందికి మాత్రమే సొమ్ము అందేలా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మోర్తాడ్ తపాల శాఖ పరిధిలోని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేయడానికి రూ. 30 లక్షలు అవసరం కాగా రూ. 6 లక్షలను మాత్రమే విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 63,924 మంది వృద్ధులు, 18,855 మంది వికలాంగులు, 66,216 మంది వితంతువులు, 206 మంది చేనేత కార్మికులు, 1,007 మంది గీత కార్మికులు, 77,346 మంది బీడీ కార్మికులు, 1,731 మంది కళాకారులు ఆసరా పింఛన్లను పొందుతున్నారు. వీరందరికి పింఛన్ల కోసం రూ. 23.87 కోట్లు అవసరం ఉంటుంది. అందులో తక్కువ మొత్తమే ప్రభుత్వం విడుదల చేయడంతో తపాల శాఖ కార్యాలయాలకు తక్కువ నిధులు అందారుు. ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయిలో పింఛన్లు మంజూరు చేసి, చిన్న నోట్లను అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లాలో
కామారెడ్డి జిల్లాలో వృద్ధాప్య పింఛన్లు 48,750, వికలాంగులకు 17,032, వితంతు 625, గీత కార్మికులకు 662, బీడీ కార్మికులకు 28,705, కళాకారులకు 903, మొత్తం లక్షా 43వేల 590 పింఛన్లు ప్రతినెలా అందజేస్తున్నారు. ప్రతినెలా 15లోపు చెల్లింపులు పూర్తవుతాయి. కానీ ఈ సారి పెద్ద నోట్ల రద్దు ప్రభావం కారణంగా పింఛన్ల డబ్బులు అందలేదు.