అక్కడ చెత్తవేస్తే రూ.50వేలు జరిమానా
న్యూఢిల్లీ: గంగా నది ప్రక్షాళన అంశంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రీన్ గంగా ప్రాజెక్టులో గంగా నది అంచు నుంచి 500మీటర్ల పరిధిలో ఎలాంటి చెత్తను డంప్ చేయడానికి వీల్లేదని ఆదేశించింది. అలాంటి వారికి భారీ జరిమానా విధించాల్సిందిగా గ్రీన్ ట్రిబ్యునల్ చీఫ్ జస్టిస్ స్వతంతర్ కుమార్ గురువారం ఆదేశించారు. లెదర్ పరిశ్రమలను కూడా గంగా నదికి దూరంగా తరలించాలని కూడా స్పష్టం చేసింది.
హరిద్వార్-ఉన్నావ్‌కు మధ్య విస్తరించిన 100 మీటర్ల పరిధిలోని భూభాగాన్ని 'నో-డెవలప్మెంట్ జోన్'గా ప్రకటించింది. అంతేకాదు ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికపై రూ. 50వేల జరిమానా విధించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ సర్కార్ చేపట్టిన చర్యలతో వచ్చిన ఫలితం శూన్యమేనని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పవిత్ర గంగానది ప్రక్షాళనకు దాదాపు రూ. 7,304 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం శూన్యమని తన ఆదేశాల్లో వ్యాఖ్యానించింది. ఈ పథకం రూపకల్పన అమలులో ప్రాథమికంగానే లోపాలు ఉన్నాయి అని ఎన్జీటీ తెలిపింది.
కాగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ మధ్య గంగా నదిలోకి వెలువడుతున్న పారిశ్రామిక కాలుష్యాలకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలో తీసుకున్నారో తెలపాలని పర్యావరణ, అటవీ, జల వనరుల మంత్రిత్వశాఖలకు, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, ఇతర సంస్థలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.