రాత్రికి రాత్రే తాపీ మేస్త్రి అకౌంట్లోకి భారీ నగదు!
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో తెలియకుండానే అకౌంట్లలోకి భారీగా నగదు వచ్చి పడుతోంది. ముంబైలో పనిచేస్తున్న ఓ ఉత్తరప్రదేశ్ తాపీ మేస్త్రీ అకౌంట్లోకి ఏకంగా రూ.62లక్షలకు పైగా నగదు రాత్రికి రాత్రే జమైంది. అంతకుముందు అతని అకౌంట్లో కేవలం రూ.7,528 మాత్రమే ఉండేవి. కానీ ఒక్కసారిగా ఇంత నగదు వచ్చి చేరడంతో, ప్రస్తుతం ఆ అకౌంట్‌ను బ్లాక్ చేశారు. ఆ నగదును ఎవరు డిపాజిట్ చేశారన్నది మాత్రం ఇంకాతెలియదు. వివరాలోకి వెళ్తే.. అజయ్ కుమార్ పటేల్ దాదాపు 15ఏళ్లుగా ముంబైలో నలసోపురాలో తాపి పనిచేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా అతను స్వగ్రామం ప్రతాప్‌ఘర్ జిల్లా సరాయ్ హరి నారాయణ్‌లోని తన ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన అతని అకౌంట్లోకి, పెద్దనోట్ల రద్దు అనంతరం భారీగా నగదు వచ్చి చేరింది.
సోమవారం ఉదయం అతనికి తన అకౌంట్లోకి నగదు డిపాజిట్ అయినట్టు ఓ మెసేజ్ వచ్చింది. కానీ అతను ఏవో కంపెనీలు పంపించే మెసేజస్ అనుకుని ఓపెన్ చేసి చూడలేదు. స్వగ్రామం నుంచి ముంబైకు తిరుగు ప్రయాణం కావడానికి పటేల్ టిక్కెట్ బుక్ చేసుకోవడానికి బాబాగంజ్, ప్రతాప్‌ఘర్ రావాల్సి ఉంది. కానీ అక్కడికి రావడానికి సరిపడ నగదు లేకపోవడంతో, తమ గ్రామ పెద్ద చంఛల్ సింగ్ నుంచి రూ.200 అప్పుగా తీసుకుని బాబాగంజ్ వెళ్లాడు. అక్కడ ఏటీఎం నుంచి తన అకౌంట్లో అంతకముందు ఉన్న నగదును విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ సమయంలో తన అకౌంట్ బ్లాక్ అయిందని పటేల్‌కు కనపడింది. దీంతో కంగారుపడిన పటేల్‌కు సోమవారం రోజు ఫోన్‌కు వచ్చిన మెసేజ్ గుర్తువచ్చింది.
వెంటనే తన ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ను మరోసారి తరువుగా చదివాడు. రూ.62లక్షలకు పైగా నగదు అకౌంట్లో డిపాజిట్ అయ్యాయని ఆ మెసేజ్‌లో ఉన్నట్టు పటేల్ పేర్కొన్నాడు. కానీ ఎవరు వేశారన్నది తెలియరాలేదని తెలిపాడు. నలసోపురా వెస్ట్ బ్రాంచులో కొన్నేళ్ల క్రితమే అతను సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేశాడు. తర్వాత బ్యాంకు కస్టమర్ కేర్ నుంచి తనకు కాల్ వచ్చిందని, బ్యాంకును వెంటనే సంప్రదించాలని వారు సూచించినట్టు పటేల్ పేర్కొన్నాడు.
ఈ సంఘటన జరిగినప్పుడు తాను స్వస్థలం యూపీలో ఉన్నట్టు ఆఫీసర్‌తో చెప్పానని, దానికి వారు ప్రూఫ్ అడగగా, గ్రామపెద్ద లేదా మెజిస్ట్రేట్‌తో సంతకం చేసిన ఓ లేఖను కూడా బ్యాంకుకు సమర్పించినట్టు పటేల్ చెప్పాడు. ఆ నగదు తనది కాదని బ్యాంకు మేనేజర్‌గా చెప్పానని, ప్రభుత్వం ఏం చేయదలుచుకుంటే అది చేయమని, కానీ తన అకౌంట్లో ఉన్న తన నగదును విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించాలని పటేల్ అభ్యర్థించాడు. పటేల్‌కు జరిగిన విషయం విన్న తామందరం చాలా ఆశ్చర్యానికి గురయ్యామని, బ్యాంకు కోరిన వెంటనే తాము లేఖను అందిచామని గ్రామ పెద్ద చంఛల్ సింగ్ పేర్కొన్నారు.